రికార్డ్ టెంపరేచర్..సల్లటి ఖండం సలసల మసులుతోంది

రికార్డ్ టెంపరేచర్..సల్లటి ఖండం సలసల మసులుతోంది

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని మన పెద్దోళ్లు చెప్తుంటరు. అంటే ఆ టైంలో ఎండలు, వేడి అంత ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే అంటార్కిటికాలో మాత్రం టెంపరేచర్ల దెబ్బకు ఐస్ షీట్లు పగిలిపోతున్నయ్! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు కిలోమీటర్ల మందం ఉన్న ఐస్ షీట్లు బ్రేక్ అయిపోతున్నయ్! అవును. అంటార్కిటికాలో ఇప్పుడు ఎండాకాలం చివరిదశలో ఉంది. మామూలుగా అయితే తీవ్రమైన ఎండాకాలంలోనూ ఇక్కడ యావరేజ్ టెంపరేచర్లు మూడు నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్లకు మించకూడదు. కానీ.. గురువారం అంటార్కిటికాలో నమోదైన గరిష్ట టెంపరేచర్ ఎంతో తెలుసా? ఏకంగా18.3 డిగ్రీలు! శనివారం సిమ్లాలో సైతం గరిష్ట టెంపరేచర్ 6 డిగ్రీలే. ఢిల్లీలో 21 డిగ్రీలే. అంటే ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండాల్సిన అంటార్కిటికా సిమ్లా కన్నా ఎంతో వేడిగా, ఢిల్లీ కన్నా కొంచెమే చల్లగా ఉందన్నమాట! గురువారం నాటి ఈ రికార్డ్ స్థాయి టెంపరేచర్​ను అంటార్కిటికా ఉత్తర భాగంలో ఉన్న అర్జెంటినా ఎస్పరాంజా రీసెర్చ్ బేస్ సైంటిస్టులు నమోదు చేశారు. అయితే, దీనిని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ వరల్డ్ మెటియోరాలజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

వేడి గాలుల వల్లే హీటెక్కుతోంది..

దక్షిణ అమెరికాలో చిట్టచివరగా ఉన్న దేశం అర్జెంటినా. దానికి దక్షిణానే అంటార్కిటికా ఉత్తర భాగం ఉంటుంది. దానిని తమ దేశంగానే భావించే అర్జెంటినా అక్కడ అనేక చోట్ల స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అంటార్కిటికాలో జనవరిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎండాకాలంలోనైనా యావరేజ్ టెంపరేచర్లు గరిష్టంగా 5 డిగ్రీలు దాటవు. కానీ ఎస్పరాంజా బేస్​లో ఈసారి రికార్డ్ బ్రేక్ అయిపోయింది. ఎత్తయిన ప్రాంతాలు, పర్వతాల నుంచి వేడిగాలులు (ఫెర్న్ విండ్స్ ) దిగువకు ప్రయాణించడం, లోతైన ప్రాంతాల్లో ఆ వేడి అక్కడే ఉండిపోవడంతో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయని భావిస్తున్నారు. ఇక్కడ గత 50 ఏళ్లలో యావరేజ్ టెంపరేచర్లు 3 డిగ్రీలు పెరిగాయట. క్లైమేట్ చేంజ్ కారణంగా మున్ముందు అంటార్కిటికాలో వేడి ఇంకా పెరిగి, ఐస్ మరింత ఎక్కువ కరిగిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.

ఐస్ అంతా కరిగితే ఏమైతది? 

భూమిపై మిగతా ప్రాంతాలతో పోలిస్తే ధ్రువాల వద్దే వేడి 5 రెట్లు ఎక్కువ వేగంగా పెరుగుతోందని ఇటీవల నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ సైంటిస్టులు గుర్తించారు. దీనివల్ల ఇక్కడ మంచు కూడా వేగంగా కరిగిపోతోందని చెప్తున్నారు. అంటార్కిటికాలో మంచు ఎంత ఎక్కువగా కరిగితే అంత మంచినీరు సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల ఈ ఖండం వద్ద సముద్రంలో నీటి ప్రవాహాల తీరే మారిపోతుందట. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో నీటి ప్రవాహాల తీరు మారి చివరికి ప్రపంచ వాతావరణమే మారిపోయే పరిస్థితి వస్తుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. అలాగే అంటార్కిటికాలోని మంచు అంతా కరిగితే సముద్రమట్టాలు ఏకంగా 60 మీటర్లు పెరుగుతాయట. 2100 నాటికి సముద్రమట్టాలు 2 నుంచి 8 అంగుళాలు పెరుగుతాయని, అప్పుడు ముంబై, చెన్నై, న్యూయార్క్ వంటి నగరాలకు ముప్పు తప్పదని ఇప్పటికే అంచనా వేశారు. మరి 60 మీటర్లు పెరిగితే ఇంకెంత ముంపు ముప్పు ఉంటుందో ఊహించుకోవచ్చు.

సముద్రాల్లో కల్లోలం పెరుగుతోంది

సముద్రాల్లో నీళ్ల వేగం ఏటేటా పెరుగుతోందట. నీళ్ల వేగం పెరుగుతుండటంతో సముద్రం లోలోపల కల్లోలం కూడా పెరుగుతోందట. ఓషన్ కరెంట్స్ (సముద్ర ప్రవాహాలు) ఏటేటా శక్తిమంతం అవుతుండటమే దీనికి కారణమట. ఇటీవల ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్ లో పబ్లిష్​అయిన ఓ స్టడీలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఓషన్ కరెంట్స్1990 నుంచీ ఏటా 5 శాతం బలోపేతం అవుతున్నాయని ఈ స్టడీలో రీసెర్చర్లు గుర్తించారు.
సముద్రాల్లో నీళ్లు ఒక చోటి నుంచి ఇంకోచోటికి ప్రవహిస్తుంటాయి. బలమైన గాలులు వీయడం, ఇతర కారణాల వల్ల నీళ్లు వేగంగా కదులుతూ ఉంటాయి. వీటినే సముద్ర ప్రవాహాలు అంటారు. అయితే ఈ ఓషన్ కరెంట్స్ వల్ల సముద్రాల్లో కల్లోలం కూడా 4 శాతం మేరకు పెరిగిందని సైంటిస్టులు అంచనా వేశారు. వాస్తవానికి క్లైమేట్ చేంజ్ వల్ల ఓషన్ కరెంట్స్ వీక్ అయిపోతాయని గతంలో అంచనా వేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఇవి మరింత స్ట్రాంగ్ కావడం, సముద్రంలో దాదాపు మూడు కిలోమీటర్ల లోతు వరకూ నీళ్లన్నీ గిలక్కొట్టినట్లు అయిపోతుండటం సైంటిస్టులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్​కు ఓషన్ కరెంట్స్​కు సంబంధించిన మోడల్స్​ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే వాతావరణాన్ని కరెక్ట్ గా అంచనా వేసేందుకు వీలవుతుందని సైంటిస్టులు తేల్చి చెబుతున్నారు.

ఏటా 25 వేల  టన్నుల మంచు..

అంటార్కిటికా.. దక్షిణ ధ్రువంపై ఆస్ట్రేలియాకు రెండింతల సైజుంటుంది. ఈ మంచు ఖండంపై దాదాపుగా 5 కిలోమీటర్ల మందమైన మంచు షీట్ ఉంటుంది. భూమిపై ఉన్న మంచినీటిలో 85 శాతం ఫ్రెష్​వాటర్ ఇక్కడే మంచురూపంలో ఉందని చెప్తారు. కానీ.. ఇప్పుడు అంటార్కిటికా మంచు ఖండం షీట్లకు పగుళ్లొస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా ఏటా 25 వేల టన్నుల మంచు కరిగిపోతున్నది. ఇంతకుముందు అత్యధిక హీట్ రికార్డ్ 2015 మార్చి 24న నమోదైంది. అప్పుడు17.5 డిగ్రీ సెల్సియస్​ల టెంపరేచర్ రికార్డ్ అయింది.