అగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన సీఎం జగన్

అగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన సీఎం జగన్

అమరావతి, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. తొలి విడతలో భాగంగా రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.70 లక్షల మందికి రూ. 263 కోట్లు పంపిణీ చేసింది. గురువారం గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..  అగ్రిగోల్డ్ బాధితుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తరుపున పరిహారం చెల్లిస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్ కేసు కోర్టు విచారణలో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు.   అగ్రిగోల్డ్ స్కాంలో గత టీడీపీ ప్రభుత్వం వాటాలేసుకుని మరీ దోచుకుందని, బాధితులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.  రెండో విడత చెల్లింపుల్లో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. దీని కోసం తర్వలోనే రూ. 811 కోట్లు విడుదల చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్ల మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మూడో విడతలో రూ. 20 వేలకు పైగా డిపాజిటర్ల చెల్లింపుల కోసం హైకోర్టు అనుమతితో అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు సాయం కోసం  పేర్లు నమోదు చేసుకోవడానికి నెల రోజుల పాటు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం కలెక్టరేట్‌‌, ఎమ్మార్వో,  గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.