బార్ల రద్దుపై ఏపీ హైకోర్టు స్టే

బార్ల రద్దుపై ఏపీ హైకోర్టు స్టే

అమరావతి, వెలుగు: ఏపీలో దశలవారీ లిక్కర్ బ్యాన్ లో భాగంగా బార్ల రద్దు నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారుకు హైకోర్టు షాకిచ్చింది. లైసెన్స్ గడువు ఉండగా అర్ధంతరంగా ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న బార్ల రద్దు నిర్ణయంపై 6 నెలల పాటు స్టే విధించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దశలవారీగా లిక్కర్ బ్యాన్ చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పటికే 43 వేల బెల్ట్ షాపులను మూసివేశారు. రాష్ట్రంలోని 4,580 వైన్ షాపుల్లో 20 శాతం మేర తగ్గించి 3,500 వైన్ షాపులను సర్కారే నిర్వహిస్తోంది. తాజాగా ఈ నెల 31 నుంచి బార్ల  లైసెన్సులన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని, ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గిస్తామని ప్రకటించింది. . దీంతో బార్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. లైసెన్స్ గడువు మరో ఏడాది ఉండగానే బార్లు  ఎలా రద్దు చేస్తున్నారని ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. మంగళవారం పిటిషన్ పై విచారించిన హైకోర్టు బెంచ్ స్టే విధించి, వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.