వీఆర్వోలతో పనిలేదు: జీపీ

వీఆర్వోలతో పనిలేదు: జీపీ

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకుసంబంధించిన అంశంపై తెలంగాణ హైకోర్టులోవాదనలు ముగిశాయి. వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను సుదీర్ఘకాలం విచారించిన హైకోర్టు ఈనెల 28లోగా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా పలుఅంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వం. వీఆర్‌వో వ్యవస్థ రద్దు విధాన నిర్ణయం తెలిపింది.

రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్‌ చేయడంతో వీఆర్వో వ్యవస్థతో పనిలేకుండా పోయిందని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలిపింది.వీఆర్‌వో చట్టాన్ని రద్దుచేస్తూ వీఆర్‌వోలను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు గల కారణాలతో పాటు బదిలీల అంశానికి సంబంధించిన వివరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వాన్ని సవాల్ చేసే హక్కు లేదు

వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేయడం విధాన నిర్ణయమని ఏజీ తెలిపారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లోకి బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సర్కార్ తీసుకున్న నిర్ణయాన్నిసవాల్‌ చేసేహక్కు ఉద్యోగికి లేదని పేర్కొన్నారు. వీఆర్‌వోల వేతనం, స్థాయికి తగ్గకుండా వారిని ఇతర శాఖల్లో నియమించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయాన్ని కొంతమంది వీఆర్వోలు ఆమోదించారని...కేవలం 60 మంది మాత్రమే విధుల్లో చేరలేదని వివరించారు. రెవెన్యూ శాఖలోని పోస్టుల్లోనే చేరాలని కోరుకునే హక్కు వీఆర్వోలకు లేదన్నారు.