కరోనా కేసుల పెరుగుదల.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో లాక్‌డౌన్ పెంపు

కరోనా కేసుల పెరుగుదల.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో లాక్‌డౌన్ పెంపు

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌‌లో లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ రీజియన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున మరో 2 వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఆగస్టు 3 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈటానగర్‌‌లో ప్రస్తుత పరిస్థితిపై స్టేట్ కేబినెట్‌తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండూ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాజధానిలో కేసుల పెంపు వల్లే ఈ డెసిజన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 650 దాటింది.

దేశంలో కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నందున భయాందోళనలు కలుగుతున్నాయి. ఎక్స్‌పర్ట్స్‌ ప్రకారం.. ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోకపోతే, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే సెప్టెంబర్ రెండో వారానికి వైరస్ ఉగ్రరూపం దాలుస్తుంది. ఆదివారం ఒక్క రోజే ఇండియాలో 38,902 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 543 మంది చనిపోయారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకారం.. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. వీరిలో 26,816 మంది మరణించారు.