వీడిన మర్డర్ మిస్టరీ.. అక్రమ సంబంధమే హత్యకు కారణం

వీడిన మర్డర్ మిస్టరీ..   అక్రమ సంబంధమే హత్యకు కారణం

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు శంషాబాద్ జోన్ డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన మక్తమాదారం బటర్ ఫ్లై వెంచర్ లో కాలిపోయిన వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతుడు బాలాపూర్ నాదర్గుల్ గ్రామానికి చెందిన తాండ్ర రవీంద్రగా గుర్తించారు.

రవీంద్ర భార్య తాండ్ర సంగీత బాలాపూర్ కి చెందిన యాదగిరితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాగైనా రవీంద్ర అడ్డు తొలగించుకోవాలని సంగీత, యాదగిరి, అతని స్నేహితుడు అనిల్ కుమార్ తో కలిసి పథకం రచించింది. ఏప్రిల్ 29వ తేదీ నిందితులు ముగ్గురు కలిసి రవీందర్ ను బెలెనో కార్లో కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి హత్య చేశారు. ఆనవాలు దొరకకుండా  పెట్రోల్ పోసి కాల్చేశారు. మృతదేహాన్ని మక్త మాదారం గ్రామ శివారులోని బటర్ ఫ్లై సిటీ వెంచర్ లో పడేశారు.

గత నెల 30వ తేదీన మృతుని భార్య గీత తన భర్త రవీందర్ కనిపించడం లేదని బావ రఘునందన్ కి ఫోన్ చేసి చెప్పింది. రఘునందన్ గీతకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పాడు. గీత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రఘునందన్ స్వయంగా గీతను తీసుకొని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసును చేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఏసిపి, సిఐ, ఎస్ఐ, పోలీసుల బృందాన్ని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డు అందజేశారు.