T20 World Cup 2026: చివరి నిమిషంలో బాయ్‌‌‌‌కాట్ ఏంటి..? పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఐసీసీకి గవాస్కర్ డిమాండ్

T20 World Cup 2026: చివరి నిమిషంలో బాయ్‌‌‌‌కాట్ ఏంటి..? పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఐసీసీకి గవాస్కర్ డిమాండ్

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగడం లేదు. టీమిండియాతో జరిగే హై ఓల్టేజ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్ చేస్తున్నట్టు పాకిస్తాన్‌‌‌‌ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 15న కొలంబోలో ఇండియాతో జరిగే మ్యాచ్‌‌‌‌లో తమ జట్టు బరిలోకి దిగబోదని తెలిపింది. పాక్‌‌‌‌  మ్యాచ్‌‌‌‌ను బహిష్కరిస్తే ఆ రెండు పాయింట్లు ఇండియాకు దక్కుతాయి.. అయితే గ్రూప్‌‌‌‌లోని మిగిలిన నమీబియా, నెదర్లాండ్స్‌‌‌‌, యూఎస్ఏ మూడు చిన్న జట్లే కావడంతో వాటిపై గెలిస్తే ఇండియాతో మ్యాచ్‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్ చేసినా పాక్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్ చేరుకోనుంది. 

పాకిస్థాన్ చేసిన పనికి టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. గవాస్కర్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ చివరి క్షణంలో ఉపసంహరించుకోవడం పెద్ద సమస్య అని నేను భావిస్తున్నాను. మీరు ముందుగానే ఉపసంహరించుకుంటే అది పూర్తిగా వేరే విషయం. కానీ వారు చివరి క్షణంలో టోర్నమెంట్ ముందు రోజు ఉపసంహరించుకున్నారు. ఐసీసీ ఎలాంటి చర్య తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఐసీసీ పాకిస్థాన్ పై ఏదో రకంగా చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదు.

భవిష్యత్తులో మరే ఇతర జట్టు కూడా అలా చేయకూడదని చూడాలి. ఇండియాతో ఆడటానికి నిరాకరించినందుకు పాకిస్తాన్‌పై ఐసీసీ చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంది. కానీ అలాంటి చర్య వల్ల ఫలితం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. పాకిస్తాన్ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఐసీసీ తీవ్ర అసంతృప్తి చెందడం ఖాయం". అని గవాస్కర్ అన్నారు. 

నేడు ఐసీసీ బోర్డు భేటీ.. పాక్‌ను తప్పించే చాన్స్‌!

ఇండియాతో  మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన పాక్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ రెడీ అవుతోంది.  సోమవారం వర్చువల్‌గా సమావేశం కానున్న  ఐసీసీ బోర్డు మెంబర్స్ నిబంధనల ఉల్లంఘన కింద పాక్‌ను ఈ టోర్నీ నుంచే పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉంది. అప్పుడు ఉగాండా టోర్నీలోకి వస్తుంది. ఇండో–పాక్‌ మ్యాచ్ రద్దు వల్ల బ్రాడ్‌కాస్టర్ కు కలిగే  రూ. 200 కోట్లకు పైగా నష్టాన్ని పీసీబీనే చెల్లించాలని ఆదేశించడం, పీసీబీకి అందాల్సిన వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవచ్చు.