రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని కేసీ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు కేసి తండా సమీపంలోని కొత్వాల్ చెరువు లో పడి మృతి చెందారు. కేసీ తండాకు చెందిన జటావత్ రిషి(6), జటావత్ బద్రీనాథ్(8) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలో ఆడుకునేందుకు మధ్యాహ్నం ఇంటినుంచి వెళ్లారు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంభ సభ్యులు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆడుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలో ఉన్న కొత్వాల్ చెరువులో పడిపోయారని అనుమానంతో చెరువులో పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ(సోమవారం) ఉదయం జటావత్ రిషి, జటావత్ బద్రీనాథ్ మృతదేహాలను వెలికితీశారు. పోస్టు మార్టూమ్ నిమిత్తం ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
