పేదలకు కార్పొరేట్ విద్యే ప్రభుత్వ లక్ష్యం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పేదలకు కార్పొరేట్ విద్యే ప్రభుత్వ లక్ష్యం..     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •  ఘనంగా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవాలు

షాద్ నగర్, వెలుగు: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప మానవ వనరులు ఉండాలని, అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్నారు. 

అందుకు కావాల్సింది విద్య, వైద్యమేనని, వాటిపైనే దృష్టి సారించి ముందుకెళ్తున్నామన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల150వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుందన్నారు. కుల, మత, ధనిక, పేద తేడా లేకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో రూ. 20వేల కోట్లతో ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.  పదేండ్లుగా మొగిలిగిద్ద పాఠశాల లో  కనీసం టాయిలెట్స్ సౌకర్యం కూడా లేవని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. 

దీంతో అడగగానే సీఎం రేవంత్ రెడ్డి  పాఠశాలకు వచ్చి రూ.10 కోట్ల మంజూరు చేశారన్నారు. త్వరలో పాఠశాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ చంద్రారెడ్డి, డీసీపీ శిరీష, ఆర్డీవో సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


లక్ష్మీ దేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలి : ప్రొఫెసర్ హరగోపాల్ వినతి

 పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా షాద్ నగర్ సెగ్మెంట్ లోని లక్ష్మీ దేవిపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు.