ట్రంప్ నిర్ణయంతో బిట్‌కాయిన్‌ క్రాష్.. అమ్మకాల జోరుతో 10 నెలల కనిష్టానికి పతనం

ట్రంప్ నిర్ణయంతో బిట్‌కాయిన్‌ క్రాష్.. అమ్మకాల జోరుతో 10 నెలల కనిష్టానికి పతనం

క్రిప్టో ప్రపంచంలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. డిజిటల్ బంగారంలా వెలిగిపోయిన బిట్‌కాయిన్ విలువ సోమవారం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా కుప్పకూలి 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫిబ్రవరి 2 నాటికి బిట్‌కాయిన్ ధర సుమారు 5 శాతం తగ్గి 74వేల 500 డాలర్ల మార్కును తాకింది. గతేడాది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వచ్చిన జోష్‌ను ఈ పతనం పూర్తిగా తుడిచిపెట్టేసింది. గత వారంలోనే బిట్‌కాయిన్ విలువ దాదాపు 15 శాతం పడిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఇప్పట్లో మళ్లీ లక్ష డాలర్ల మార్కును అందుకోవటం కుదరదా అనే ప్రశ్న చాలా మంది పెట్టుడిదారుల్లో కొనసాగుతోంది. 

ఎందుకు ఈ క్రిప్టో క్రాష్..?

ఈ ఆకస్మిక పతనానికి కేవలం ఒక్క కారణం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పలు పరిణామాలు తోడయ్యాయి. ముందుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త  చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను ట్రంప్ నామినేట్ చేయడం మార్కెట్‌పై నెగటివ్ ఇంపాక్ట్ చూపింది. ఆయన కఠినమైన ద్రవ్య విధానాలను అనుసరిస్తారనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

ALSO READ : ఒరాకిల్ మెగా లేఆఫ్స్.. 30 వేల మంది టెక్కీలు ఇంటికే.. టార్గెట్ ఎవరంటే..?

అలాగే ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు వద్ద పేలుడు సంభవించిందనే వార్తలు, దానివల్ల అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవచ్చనే ఆందోళనలు మార్కెట్‌ను దెబ్బతీశాయి. ఈ పరిణామాలతో ఒక్క రోజులోనే క్రిప్టో మార్కెట్‌లో సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ సుమారు రూ.18వేల కోట్లుగా ఉంది. అంటే చాలా మంది ట్రేడర్లు తమ పెట్టుబడులను వదులుకోవాల్సి వచ్చింది.

ఇతర క్రిప్టో కాయిన్ల పరిస్థితి ఏంటి మరి..?

కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు.. ఇతర ప్రధాన క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా నష్టపోయాయి. ఇథీరియం దాదాపు 10 శాతం పడిపోయి 2వేల200 డాలర్ల స్థాయికి చేరుకోగా.. సోలానా, ఎక్స్‌ఆర్‌పి, డోజీకాయిన్ వంటి టాప్ కాయిన్లు కూడా 5 నుంచి 7 శాతం మేర క్షీణించాయి. జనవరి నెల మొత్తం కలిపి బిట్‌కాయిన్ 11 శాతం నష్టపోయింది. ఇది గత ఏడేళ్లలో బిట్‌కాయిన్‌కు అత్యంత గడ్డు కాలంగా నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : భారత ఆర్థిక వృద్ధిపై ఎలోన్ మస్క్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ప్రస్తుతానికి మార్కెట్ నిలకడగా లేదు. బిట్‌కాయిన్ గనుక 70వేల డాలర్ల మార్కు దిగువకు జారుకుంటే.. అది దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు చక్కబడి, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగే వరకు ఈ ఒడిదుడుకులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.