IT Layoffs: టెక్ ప్రపంచంలో 'లేఆఫ్' అనే పదం మళ్లీ మారుమోగుతోంది. గత ఏడాది అమెజాన్, గూగుల్, మెటా వంటి దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిన షాక్ నుంచి ప్రపంచం ఇంకా తేరుకోకముందే.. ఇప్పుడు డేటాబేస్ దిగ్గజం ఒరాకిల్ వంతొచ్చింది. ఏకంగా 20వేల నుంచి 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుండటంతో టెక్ వర్గాల్లో వణుకు మొదలైంది. ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం కాదు.. యావత్ టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయనడానికి ఒక హెచ్చరికగా చెప్పుకోవచ్చు.
ఎందుకు ఈ భారీ లేఆఫ్స్..?
ఒరాకిల్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం దాని భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలవాలని ఒరాకిల్ సుమారు 156 బిలియన్ డాలర్ల అక్వా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. అయితే అమెరికన్ బ్యాంకులు ఈ ప్రాజెక్ట్‌కు నిధులు ఇచ్చేందుకు వెనకాడుతున్నాయి. దీనికి తోడు వడ్డీ రేట్లు రెట్టింపు కావడంతో అప్పులు దొరకడం గగనమైపోయింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి.. కంపెనీ వద్ద ఉన్న డబ్బును ఆదా చేయడానికి ఉద్యోగుల తొలగింపును ఒక మార్గంగా ఎంచుకుంది సంస్థ. ఈ లేఆఫ్స్ ద్వారా సుమారు 8 నుండి 10 బిలియన్ డాలర్ల డబ్బు ఆదా చేయాలని ఒరాకిల్ భావిస్తోంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపుగా రూ.లక్ష కోట్ల వరకూ కంపెనీకి లేఆఫ్స్ వల్ల డబ్బు సేవ్ అవుతుంది.
ఎవరిపై ఈ ప్రభావం..?
ఈ లేఆఫ్స్ ప్రధానంగా ఒరాకిల్ ఇటీవల కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ విభాగం 'సెర్నర్'(Cerner) పై పడే అవకాశం ఉంది. దాదాపు 28.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ విభాగాన్ని విక్రయించే ఆలోచనలో కూడా కంపెనీ ఉంది. దీంతో పాటు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాల్లోని సీనియర్ మిడ్-లెవల్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటికే 10వేల మందిని తొలగించిన ఒరాకిల్, ఇప్పుడు రెండో విడతలో అంతకు మించి కోత విధించడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టెక్ ప్రపంచం వణికిపోతోంది..
టెక్ రంగంలో ఒకప్పుడు స్థిరత్వానికి మారుపేరుగా నిలిచిన కంపెనీలే ఇప్పుడు మనుగడ కోసం ఆస్తులను అమ్మేసుకోవడం, వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసియా బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఒరాకిల్‌కు రావడం, టెక్ మార్కెట్‌లో నిధుల కొరతను స్పష్టం చేస్తోంది. ఏఐ రేసులో నిలబడాలంటే వేల మంది ఉద్యోగులను బలి ఇవ్వక తప్పదనే సంకేతాలు ఈ నిర్ణయంతో వెలువడుతున్నాయి. ఇది ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీలపై కూడా డొమినో ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అంటే ఒక కంపెనీ బాటలోనే మిగిలినవి కూడా నడిచే ప్రమాదం ఉందన్నమాట.
మొత్తానికి టెక్ నిపుణులు ఇప్పుడు తమ ఉద్యోగ భద్రత గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒరాకిల్ తీసుకున్న ఈ సాహసోపేతమైన, కానీ క్రూరమైన నిర్ణయం టెక్ ఇండస్ట్రీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.
