2026-27 బడ్జెట్ సందర్భంగా యువతతో మాట్లాడిన నిర్మలా సీతారామన్, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ వాటా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో చైనా వాటా 26% ఉండగా, భారతదేశం 17% వాటాను అందిస్తోంది. అంటే ప్రపంచ వృద్ధిలో 43% ఈ రెండు దేశాల నుండే వస్తోంది.
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) గణాంకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెరికా కంటే భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతోందని చూపిస్తూ, ప్రపంచ శక్తి బ్యాలెన్స్ మారుతోంది అని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి.. ఎలోన్ మస్క్ వంటి వారే భారత్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని గుర్తు చేశారు.
మన దేశం ఎంత బలంగా ఎదుగుతుందో ఇప్పటికైనా ప్రతిపక్షాలు గుర్తించాలి అని నిర్మలమ్మ అన్నారు. ప్రస్తుతం చైనాకు, మనకు మధ్య ఉన్న గ్యాప్‌ను భవిష్యత్తులో భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
►ALSO READ | నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు
అయితే ఆదివారం నిర్మల సీతారామన్ పార్లమెంటులో వరుసగా 9వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో యువతకు అవకాశాలు, పర్యాటక రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై అదనపు సుంకాలు విధిస్తుండటంతో ఎలోన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రపంచ ఆర్థిక శక్తి అమెరికా వంటి దేశాలు నుండి భారత్, చైనా వైపు స్పష్టంగా మారుతోందని ఎలోన్ మస్క్ షేర్ చేసిన చార్ట్ చూపిస్తుంది.
2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, న్యూఢిల్లీలో పార్లమెంటులో జరిగిన 'యూత్ డైలాగ్'లో నిర్మలా సీతారామన్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. లోక్‌సభ గ్యాలరీ నుండి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన దాదాపు 30 మంది యూనివర్సిటీ విద్యార్థులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు జరుగుతున్నా, భారతదేశం మాత్రం ఆర్థిక పటిష్టతను ఎలా చాటుకుంటుందో ఆమె విద్యార్థులకు వివరించారు.
