నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు

నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు

న్యూఢిల్లీ: దేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీని పెంచే దిశగా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల కీలక ప్రకటన చేశారు. నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అపార ఖనిజ సంపద ఉన్న ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో ఈ కారిడార్లను ఏర్పాటు చేస్తామని, ఆయా రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మాన్యుఫ్యాక్చరింగ్ ను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. అయితే, వీటిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఇలా వరాలు కురిపించినట్టుగా అంచనా వేస్తున్నారు.

 కాగా, కన్జూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫైటర్ జెట్ ల పరికరాల తయారీకి 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అత్యంత కీలకంగా ఉన్నాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్ లో నెంబర్ వన్ గా ఉన్న చైనా.. ప్రపంచ ఉత్పత్తిలోనే 60 శాతం వాటాను కలిగి ఉంది. రిఫైన్డ్ ప్రొడక్షన్ లో ఆ దేశానికి ఏకంగా 90 శాతం వాటా ఉంది. దీంతో  ప్రపంచ దేశాలన్నీ చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మన దేశంలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్ల మైనింగ్ ను పెంచుకునే దిశగా రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.