ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ చివరి దశకు వచ్చేసింది. 38 మ్యాచ్ ల సమరం తర్వాత సెమీస్ కు చేరే నాలుగు జట్లేవో తేలిపోయాయి. టోర్నీలో రెండు సెమీ ఫైనల్స్ తో పాటు ఒక ఫైనల్ మాత్రమే మిగిలి ఉంది. మొత్తం మూడు మ్యాచ్ లతో మరికొన్ని రోజుల్లో అండర్-19 టోర్నీ ముగుస్తుంది. టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు తలపడతాయి. రెండో సెమీ ఫైనల్లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీ ఫైనల్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ షెడ్యూల్:
1వ సెమీ-ఫైనల్: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్.. ఫిబ్రవరి 3.. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్.. బులవాయోలో
2వ సెమీ-ఫైనల్: ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్.. ఫిబ్రవరి 4.. హరారే స్పోర్ట్స్ క్లబ్.. హరారేలో
భారత కాలమాన ప్రకారం రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లో మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతాయి.
ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ లైవ్ టెలికాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:
ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ లైవ్ టెలికాస్టింగ్ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే జియో హాట్ స్టార్ లో చూడొచ్చు.
పాకిస్థాన్ ను చిత్తు చేసి సెమీస్ కు టీమిండియా:
అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా ఆరోసారి సెమీస్‌కు చేరుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 1) బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మ్యాచులో పాకిస్తాన్‌పై భారత ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి దాయాది దేశాన్ని 58 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా 2025 అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఓటమికి టీమిండియా కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. సెమీస్ పోరులో భాగంగా ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
►ALSO READ | T20 World Cup 2026: ఐసీసీ ప్రోటోకాల్స్ పాటించాల్సిందే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ రోజు శ్రీలంకకు టీమిండియా
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ ఇండియా చేసిన ఇండియా 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌటై తీవ్ర నిరాశ పర్చగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (30) పర్వాలేదనిపించాడు. వేదాంత్ త్రివేది (65) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35) రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుబాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సయ్యం రెండు వికెట్లు, అలీ రజా ఒక వికెట్ తీశారు.
అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో హంజా జహూర్ (42), ఉస్మాన్ ఖాన్ (66), ఫర్హాన్ యూసఫ్ (38) తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ కు ఓటమి తప్పలేదు. ఇండియా బౌలర్లలో ఖిలాన్ పటేల్, కెప్టెన్ ఆయుష్ మాత్రే చెరో మూడు వికెట్లు తీశారు. అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ సాధించారు.
