Rohit Shetty Firing Case: రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు: దర్యాప్తులో కీలక మలుపు.. ఐదుగురు అరెస్ట్

Rohit Shetty Firing Case: రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు: దర్యాప్తులో కీలక మలుపు.. ఐదుగురు అరెస్ట్

ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం (జనవరి 31) అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నాలుగు నుంచి ఆరు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాల సహాయంతో సంఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆధారాలను సేకరించారు. అక్కడ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకుని కీలక సమాచారాన్ని రాబట్టారు.

సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు పుణేకు చెందినవారిగా గుర్తించి, ముంబైకి తరలించి విచారిస్తున్నారు. నిందితులకు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై రోహిత్ శెట్టి ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం చుట్టూ భారీ భద్రతను పెంచారు.

బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా?

ఈ కేసులో సీసీటీవీ దృశ్యాలను కీలక ఆధారంగా తీసుకుని ముంబై పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ప్రత్యక్షంగా పాల్పడింది ఒక్కరే అయినప్పటికీ, అతడికి సహకరించినట్లు అనుమానించిన మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా ఈ నిందితులు అందరూ పుణేకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ముంబైకి తరలించి లోతుగా విచారిస్తున్నారు. వీరికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత కారణాలతోనే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక!!

ఈ కాల్పుల ఘటన తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఈ కాల్పులు తమ హెచ్చరికగా చెబుతూ “ఇది కేవలం చిన్న ట్రైలర్ మాత్రమే, భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని”  బెదిరించినట్లు సమాచారం.

►ALSO READ | Ram Charan: మెగా మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్.. 500 కుటుంబాలకు ఆరోగ్య భరోసా!

అయితే ఈ పోస్ట్ నిజంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చిందా? అనే విషయంపై పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే, అరెస్టయిన ఐదుగురు నిందితులకు బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే, గతంలో హీరో సల్మాన్ ఖాన్‌ను కూడా ఇదే ముఠా బెదిరించిన విషయం తెలిసిందే.

రోహిత్ షెట్టి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు తీయడంలో దిట్ట. గోల్‌మాల్ కామెడీ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందారు. సింగమ్, సింబా, సూర్యవంశీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే వంటి అనేక బ్లాక్‌బస్టర్ యాక్షన్ చిత్రాలను అందించారు. ప్రస్తుతం ఆయన గోల్ మాల్ 5 రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుందీ మూవీ.