సెకండ్‌‌ రౌండ్‌‌ లో గాయం..గేమ్ నుంచి బార్టీ ఔట్‌

సెకండ్‌‌ రౌండ్‌‌ లో  గాయం..గేమ్ నుంచి బార్టీ ఔట్‌

సెకండ్‌‌ రౌండ్‌‌ మధ్యలో  వైదిలిగిన స్టార్‌‌
మూడో రౌండ్‌‌లో జొకో, ఫెడెక్స్​, మెద్వెదెవ్‌‌

పారిస్‌‌:  వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ ప్లేయర్‌‌, టాప్‌‌ సీడ్‌‌ యాష్లే బార్టీకి నిరాశ. గాయం కారణంగా  ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లోనే ఆమె వెనుదిరిగింది. ఎడమ తుంటి గాయం తిరగబెట్టడంతో రొలాండ్‌‌ గారోస్‌‌ను వీడాల్సి వచ్చింది.  పోలాండ్‌‌కు చెందిన మగ్డా లినెట్టేతో  గురువారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ సెకండ్‌‌ రౌండ్‌‌లో 6–1, 2–2తో లీడ్‌‌లో ఉండగా నొప్పి ఎక్కువ కావడంతో బార్టీ ఆట కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియా స్టార్‌‌ రిటైర్డ్‌‌ హర్ట్‌‌ అవడంతో లినెట్టేకు వాకోవర్‌‌ లభించింది. ఇక, గతేడాది రన్నరప్‌‌, నాలుగో సీడ్‌‌ సోఫియా కెనిన్‌‌ (అమెరికా) 7–5, 6–3తో హెయిలే బాప్టిస్ట్‌‌ (అమెరికా)ను ఓడించి మూడో రౌండ్‌‌ చేరింది. మరో మ్యాచ్‌‌లో ఐదోసీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్‌‌) 6–0, 6–4తో అన్‌‌ లి (అమెరికా)ను చిత్తు చేసింది. అయితే, 9వ సీడ్‌‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌‌) 5–7, 1–6తో అమెరికా యంగ్‌‌స్టర్‌‌ స్లోన్‌‌ స్టీఫెన్స్‌‌ చేతిలో అనూహ్యంగా ఓడింది. ఇతర మ్యాచ్‌‌ల్లో 13వ సీడ్‌‌ యూఎస్‌‌ ప్లేయర్‌‌ జెన్నిఫర్‌‌ బ్రాడీ 6–4, 2–6, 7–5తో ఫియనో ఫెర్రో (ఫ్రాన్స్‌‌)పై, 14వ సీడ్‌‌ ఎలైస్‌‌ మెర్టెన్స్‌‌ (బెల్జియం) 4–6, 6–2, 6–4తో జరినా దియాస్‌‌ (కజకిస్తాన్‌‌)పై కష్టపడి నెగ్గారు. 17వ సీడ్‌‌ మరియా సకారి, 18వ సీడ్‌‌ ముచోవా, 24వ సీడ్‌‌ కోరి గాఫ్‌‌ కూడా మూడో రౌండ్‌‌ చేరగా, 11వ సీడ్‌‌ పెట్రా క్విటోవా (చెక్) గాయం కారణంగా టోర్నీ నుంచి విత్‌‌డ్రా అయింది. 
జొకోవిచ్‌‌ జోరు
మెన్స్‌‌ సింగిల్స్‌‌లో వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ జోరు నడుస్తోంది. సెకండ్‌‌ రౌండ్‌‌లో 6–3, 6–2, 6–4తో ఉరుగ్వే ప్లేయర్‌‌ పాబ్లో క్యూవాస్‌‌ను వరుస సెట్లలో చిత్తు చేసిన సెర్బియా లెజెండ్‌‌ మూడో రౌండ్‌‌లో అడుగు పెట్టాడు.  మరోవైపు స్విస్‌‌ మాస్టర్‌‌, ఎనిమిదో సీడ్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌ 6–2, 2–6, 7–6 (7/4), 6–2తో క్రొయేషియా ప్లేయర్‌‌ మారిన్‌‌ సిలిచ్‌‌పై నాలుగు సెట్ల పాటు కాస్త కష్టపడి గెలిచాడు. అయితే, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే రోజర్‌‌ ఈ మ్యాచ్‌‌లో సిలిచ్‌‌, అంపైర్‌‌ జోసెఫ్‌‌తో వాదనకు దిగాడు. తాను ఆటను ఆలస్యం చేస్తున్నానంటూ  సిలిచ్‌‌.. అంపైర్‌‌కు కంప్లైంట్‌‌ చేయడంతో ఫెడెక్స్‌‌కు కోపం వచ్చింది.  మరో మ్యాచ్‌‌లో రెండో సీడ్‌‌ మెద్వెదెవ్‌‌ (రష్యా) 3–6, 6–1, 6–4, 6–3తో టామీ పాల్‌‌ (అమెరికా)ను ఓడించాడు. ఐదో సీడ్‌‌ సిట్సిపాస్‌‌ (గ్రీస్‌‌) 6–3, 6–4, 6–3తో మార్టినెజ్‌‌ (స్పెయిన్‌‌)ను చిత్తు చేశాడు. ఒపెల్కా, ఫోగ్నిని కూడా రెండో రౌండ్‌‌లో గెలిచి ముందుకెళ్లారు. 
మూడో రౌండ్‌‌లో బోపన్న జోడీ
మెన్స్‌‌ డబుల్స్‌‌లో ఇండియా స్టార్‌‌ రోహన్‌‌ బోపన్న మూడో రౌండ్‌‌ చేరాడు. సెకండ్‌‌ రౌండ్‌‌లో బోపన్న (ఇండియా)–ఫ్రాంకో సెకుగొర్‌‌ (క్రొయేషియా) జంట 6–4, 7–5తో వరుస సెట్లలో అమెరికా జోడీ ఫ్రాన్స్‌‌ టైఫొయె–నికోలస్‌‌ మన్రోయెను ఓడించింది.