ఏడు నెలల పాపతో డ్యూటీకి.. అమ్మా నీకు సలాం

ఏడు నెలల పాపతో డ్యూటీకి.. అమ్మా నీకు సలాం

తాను చేసే ఉద్యోగానికి అప్పుడే పుట్టిన బిడ్డ అడ్డం కాకూడదు అనుకుంది ఓ మహిళా కానిస్టేబుల్. మరుక్షణం కూడా ఆలోచించకుండా..  ఆ పాపను తనతో పాటు తీసుకెళ్లి బాధ్యతాయుతంగా డ్యూటీని నిర్వర్తించింది. సచితా రాణి రాయ్.. కాచర్ జిల్లాలోని సిల్చార్ పిఐ కోర్ట్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.  ప్రసూతి సెలవు ముగియడంతో తన బిడ్డతో కలిసి రోజూ ఉదయం 10:30 గంటలకు  కార్యాలయానికి చేరుకుంటున్నారు. మునుపటిలాగే అంకితభావంతో  విధులను నిర్వర్తిస్తున్నారు.  

ప్రసూతి సెలవు ముగియడంతో మరిన్ని సెలవుల కోసం ఆమె రిక్వెస్ట్ చేసినప్పటికీ మంజూరు కాలేదు. బిడ్డను చూసుకోవడానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఆమె బిడ్డతో సహా డ్యూటీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు అసౌకర్యంగా ఉంటుందని, కానీ తనకు వేరే మార్గం లేదని అంటున్నారు కానిస్టేబుల్ సచితా రాణి రాయ్.  ఆమె భర్త సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్. అస్సాం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

"రోజంతా పాప నాతో ఉండటం చాలా కష్టంగా ఉన్నందున.. మునుపటి కంటే కొంచెం ముందుగానే డ్యూటీకి బయలుదేరుతున్నాను " అని చిరునవ్వుతో సచిత చెబుతున్నారు. తదుపరి సెలవు కోసం దరఖాస్తు చేశానని, దానికి ఆమోదం లభించే వరకు డ్యూటీని ఈ విధంగానే కొనసాగిస్తానని అంటున్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న సచితా రాణి రాయ్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.