కంపెనీలు రిస్క్‌ తీసుకోవట్లే … బ్యాంకులు అప్పులియ్యట్లే

కంపెనీలు రిస్క్‌ తీసుకోవట్లే … బ్యాంకులు అప్పులియ్యట్లే

కొత్త అప్పులివ్వడానికి బ్యాంకులు విముఖంగా ఉంటున్నాయి
స్ట్రెస్డ్‌ అసెట్‌ ఫండ్‌ లో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేస్తున్నాం
తాజా పరిస్థితులపై హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్​ కేకి మిస్త్రీ కామెంట్స్‌‌

ముంబై: రాజకీయ, రెగ్యులేటరీ ఒత్తిళ్ల వలన కంపెనీలు రిస్క్‌‌ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కేకి మిస్త్రీ బుధవారం అన్నారు. ఇండస్ట్రీ బాడీ సీఐఐ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌‌ను మెరుగుపరచడానికి కంపెనీ బోర్డు డైరక్టర్లు, రాజకీయ, రెగ్యులేటరీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనివలన కంపెనీ రిస్క్‌‌ తీసుకోవడం తగ్గుతోందని, వృద్ధి మందగించడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. రిస్క్‌‌ తీసుకోకపోవడంతోనే కార్పొరేట్‌‌లకు మరింత అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగేస్తున్నాయని అన్నారు. ఆర్థిక సంవత్సరం 2020 జీడీపీ అంచనా(5 శాతం) 11 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంపై మాట్లాడుతూ ఆయనీ కామెంట్స్‌‌ చేశారు. రిస్క్‌‌ ఉంటుందనే కారణాన స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆమోదించని ఇండిపెండెంట్‌ డైరక్టర్లను చూశానన్నారు. సామర్ధ్యం ఉన్న ఇండిపెండెంట్‌ డైరక్టర్లు కంపెనీల బోర్డులో జాయిన్‌ అవ్వడానికి ఇష్టపడటంలేదని తెలిపారు. ఇండిపెండెంట్‌ డైరక్టర్లపై ఒత్తిళ్లు తగ్గాలన్నారు. ఇండిపెండెంట్‌ డైరక్టర్లు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు తగ్గడానికి ఇండస్ట్రీ లాబీ సీఐఐ కృషి చేస్తుందని ఆశించారు. బ్యాంకర్ల గురించి మాట్లాడుతూ.. మంచి కస్టమర్లకు కూడా మళ్లీ అప్పులిచ్చేందుకు బ్యాంకర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇదే ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా దెబ్బతీస్తోందన్నారు. గత రెండేళ్ల నుంచి చూస్తే బ్యాంకులు రిస్క్‌‌కు దూరంగా ఉంటున్నాయన్నారు. ప్రస్తుతం మేము ట్రాన్సిషన్‌ పిరియడ్‌‌లో ఉన్నామని, ప్రభుత్వం తీసుకునే చర్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు.

స్ట్రెస్డ్‌ అసెట్‌ ఫండ్‌‌లో హెచ్‌డీఎఫ్‌సీ…
రియల్టీ సెక్టార్‌ కోసం ప్రభుత్వం పెట్టిన స్ట్రెస్డ్‌‌ అసెట్‌ ఫండ్‌‌లో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ సిద్ధంగా ఉందని కేకి మిస్త్రీ తెలిపారు. రియల్టీ సెక్టార్‌ తిరిగి పుంజుకోవడం చాలా బ్యాంకులతో ముడిపడి ఉందన్నారు. కానీ రెగ్యులేటరీ ఇష్యూల వలన నిలిచిపోయిన రియల్టీ ప్రాజెక్టులకు అప్పులివ్వడానికి ఈ బ్యాంకులు సిద్ధంగా లేవన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కోసం గతేడాది నవంబర్‌‌లో ప్రభుత్వం రూ. 25,000 కోట్ల రిలీఫ్​ ప్యాకేజిని ఈ రంగం కోసం ప్రకటించింది. ఇందులోనే నిలిచిపోయిన ప్రాజెక్టు‌లకు సాయం చేయడానికి ప్రత్యేక ఫండ్‌‌ను ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ క్యాపిటల్‌‌ ఈ ఫండ్‌‌ను మేనేజ్‌ చేస్తోంది. రూ. 10,530 కోట్లతో కార్యకలాపాలు మొదలెడతామని గత నెలలో ఎస్‌బీఐ క్యాపిటల్‌‌ ప్రకటించింది. రియల్టీ సెక్టార్‌ పుంజుకోవాలంటే బ్యాంకులు అప్పులివ్వడం పెరగాలని కేకి మిస్త్రీ అన్నారు. కానీ ఒకరి బుక్‌‌లో ఎన్‌పీఏగా ఉన్న ప్రాజెక్టుకు అప్పులివ్వడానికి మిగిలిన ఏ బ్యాంకులు ముందుకు రావడంలేదన్నారు. ఇటువంటి ప్రాజెక్టులకు అప్పులిస్తే మొదటి రోజు నుంచే ఈ అప్పును ఎన్‌పీఏగా పరిగణించాల్సి వస్తుందని తెలిపారు. వ్యవస్థలోని పరిస్థితుల వలన గత నాలుగైదు క్వార్టర్ల నుంచి ప్రాజెక్టులకు రుణాలివ్వడం తగ్గించామని అన్నారు. కానీ పర్సనల్‌‌ లోన్‌‌లను యధావిధిగా ఇస్తున్నామని తెలిపారు. రియల్‌‌ ఎస్టేట్‌ సెక్టార్‌ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమని, ఈ సెక్టార్‌ వలన పెద్ద మొత్తంలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. రియల్టీ సెక్టార్‌ కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిని ఆహ్వానిస్తున్నామని అన్నారు. గ్రోత్‌ మొమెంటం మెరుగుపడడానికి ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టాలని సలహాయిచ్చారు.