నల్సార్ స్టూడెంట్ల ఎన్‎రోల్‎మెంట్ నిషేధంపై బీసీఐ యూ టర్న్

నల్సార్ స్టూడెంట్ల ఎన్‎రోల్‎మెంట్ నిషేధంపై  బీసీఐ యూ టర్న్
  • బార్ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా ఆదేశాలు.. కొద్ది సేపటికే యూటర్న్ 
  •     కాన్వొకేషన్​కు సీజేఐని పిలవొద్దని నల్సార్​ వీసీకి విద్యార్థుల లేఖ
  •     స్టూడెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ నిలిపివేయాలని బార్ కౌన్సిళ్లకు బీసీఐ సర్క్యులర్
  •     బీసీఐ తీరుపై విమర్శలు వ్యక్తమవడంతో నిర్ణయం వెనక్కి

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని నల్సార్ లా విశ్వవిద్యాలయ కాన్వొకేషన్​కు చీఫ్​గెస్ట్​గా సీజేఐ జస్టిస్ సూర్య కాంత్‌‌ను ఆహ్వానించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 బ్యాచ్ విద్యార్థులు దేశంలోని రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ చేసుకోకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిషేధించింది. ఈ మేరకు గురువారం బీసీఐ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా.. నల్సార్ వైస్ చాన్స్​లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావుతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల సెక్రటరీలకు ఆరుపేజీల సర్క్యులర్ జారీ చేశారు. అయితే, ఈ సర్క్యులర్ జారీ చేసిన కొద్దిసేపటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 

నల్సార్ లా వర్సిటీ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌‌లో న్యాయవాదులుగా ఎన్‌‌రోల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. నల్సార్ లా విశ్వవిద్యాలయం రాబోయే గ్రాడ్యుయేషన్ (కాన్వొ కేషన్) వేడుకలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావించింది. అయితే, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుమారు 450 మందికి పైగా విద్యార్థులు నల్సార్ ​వైస్ చాన్స్​లర్ కి లేఖ రాశారు.

ఆయనను ముఖ్య అతిథిగా పిలవకూడదని కోరారు. ఈ అంశాన్ని బీసీఐ తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు లేదా సీజేఐ వ్యవస్థను గౌరవించని విద్యార్థులు బాధ్యతాయుతమైన న్యాయవాదులు కాలేరని పేర్కొంటూ.. నల్సార్‌‌కి చెందిన 2026 బ్యాచ్‌‌ గ్రాడ్యుయేట్లు ఎవరూ ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌‌లోనూ లాయర్‌‌గా నమోదు చేసుకోవడానికి వీల్లేదని గురువారం బీసీఐ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా సర్క్యులర్​ జారీ చేశారు. ఈ నిరసనను ఎవరు ఉసిగొల్పారు, ఎవరు ముందంజలో ఉన్నారు అనే అంశంపై పూర్తి విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు. 

అయితే, ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడం, విద్యార్థుల భవిష్యత్తు, ప్లేస్‌‌మెంట్లపై ఆందోళనలు చెలరేగడంతో బీసీఐ అత్యవసరంగా సమీక్షించింది. అనంతరం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. నల్సార్‌‌లోని మెజారిటీ విద్యార్థులు అమాయకులని, వారికి సీజేఐని లేదా న్యాయవ్యవస్థను అవమానించే ఉద్దేశం లేదని తెలిపింది. 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌‌లో న్యాయవాదులుగా ఎన్‌‌రోల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే, ఈ అంశంపై బీసీఐ కొన్ని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదం వెనుక కొందరు అధ్యాపకులు, బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే సమాచారం ఉందని, వర్సిటీ వైస్ చాన్స్​లర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.