లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకురాలు

లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకురాలు

దానం చేయాలంటే కోట్ల ఆస్తి ఉండక్కరలేదు... ‘నలుగురికి సాయం చేయాలి. ఎవ్వరూ ఆకలితో పడుకోకూడదు’ అన్న గొప్ప మనసుంటే చాలు. అచ్చం అలానే తనలా ఎవ్వరూ ఆకలి బాధపడొద్దు అనుకుంది. ఎవరిదైనా ఆకలి ఒక్కపూట తీర్చినా చాలని 80 ఏండ్ల అశ్వతమ్మ లక్ష రూపాయలను అన్నదాన సత్రానికి దానం చేసింది. అలాగని ఆమె లక్షాధికారి కాదు. ఆస్తిపాస్తులు కూడా లేవు. రోజూ గుడిముందు భిక్షం ఎత్తుకునే యాచకురాలు. పద్దెనిమిదేండ్లుగా గుడి మెట్లముందు భిక్షమెత్తుకుని బతుకుతోంది. అయితే ఇప్పుడు మంగళూరు‌‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలి శ్రీ క్షేత్ర రాజరాజేశ్వరి గుడి వార్షికోత్సవాల సందర్భంగా ఆ గుడి ముందు నెలరోజుల పాటు భిక్షాటన చేసి లక్ష రూపాయలు సంపాదించింది. ఆ డబ్బును దేవాలయానికి విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచింది.

యాచకురాలిగా

ఉడిపి జిల్లాలోని కంచగోడు అశ్వతమ్మ సొంతూరు. ముందునుండి తనేం యాచకురాలు కాదు. పేద కుటుంబమే అయినా భార్యాభర్తలిద్దరు ఏరోజూ పస్తులతో పడుకోలేదు. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడానికి కాయకష్టం చేసేవాళ్లు. వీళ్లకు ఒక కొడుకు. అతను కూడా కూలి పనిచేసేవాడు. అశ్వతమ్మకు యాభై ఎనిమిదేండ్ల వయసులో భర్త చనిపోయాడు. ఇక అప్పటినుంచి ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు కొడుకు. అతను కూడా అశ్వతమ్మకు అరవై రెండేండ్లప్పుడు చనిపోయాడు. విధి తనతో ఆడుకుంటుంది అనుకుందే కానీ ధైర్యం కోల్పోలేదు అశ్వతమ్మ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. పైగా వయసు మీద పడింది. కూలినాలి కూడా చేయలేదు. అందుకని ఊరి నుండి బయటికి వచ్చి భిక్షాటన చేయడం మొదలు పెట్టింది. అలా ఇప్పటికి భిక్షాటన చేయబట్టి పద్దెనిమిదేండ్లు.

విరాళాలు ఎందుకు ఇస్తుందంటే

ఇంటినుండి బయటికి వచ్చాక హోటల్స్‌‌ వాళ్లను మిగిలిన బువ్వ పెట్టమని అడిగితే ‘దూరం పో’ అని నెట్టేసేవాళ్లట. అలా ఆకలితో పడుకున్న రోజులు చాలానే ఉన్నాయి. తరువాత గుడి మెట్లే ఇల్లు అయ్యాయి. అన్నదాన సత్రాలు ఆకలి తీర్చేవి. అప్పుడు అనుకుంది ‘నాలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్ల ఆకలిని తీర్చే సాయం చిన్నదైనా నేను చేయాలి’ అనుకుంది. అప్పటినుండి తను భిక్షం ఎత్తుకోగా వచ్చిన డబ్బులో కొంత ఖర్చులకు వాడుకుని, మిగిలిన డబ్బును బ్యాంక్ అకౌంట్‌‌లో వేసుకునేది.అలా ఒక్క రాజరాజేశ్వరి గుడికేకాదు పద్దెనిమిదేం డ్లుగా శబరిమల అయ్యప్ప, సాలిగ్రామం ఆలయాలకు విరాళం ఇచ్చింది. ఇవేకాకుండా ఉడిపిలోని ఎన్నో  అనాథ, వృద్ధాశ్రమాలు మొత్తం కలిపి పదిలక్షలకు పైగా విరాళాలు ఇచ్చింది. 

‘‘గుడికి వచ్చే భక్తులు వేసిన భిక్ష వల్లే మా ఆకలి తీరుతోంది. అందుకే నా అవసరాలు తీరాక మిగిలిన డబ్బును ఆ దేవుడికే ఇస్తున్నా. దాంతో ఆయనే ఇంకొకరి ఆకలి తీరుస్తాడు. నా వల్ల అవసరమైన వాళ్ల ఆకలి బాధ ఒక్క పూట తీరినా సంతోషమే. హోటల్స్‌‌లో రోజూ చాలా అన్నం పారే స్తుంటారు. అలా పడేసే బదులు ఆకలితో ఉన్న వాళ్లకు ఇవ్వొచ్చుగా’’ అంటోంది అశ్వతమ్మ.