టెలికాం చార్జీలు పెంచడానికి ఇదే సరైన సమయం

టెలికాం చార్జీలు పెంచడానికి ఇదే సరైన సమయం
  •  మొబైల్ టారిఫ్ కనీసం 33శాతం పెంచాలి: ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్

‘‘టెలికాం చార్జీల భారం మోయలేనంత భారంగా మారాయి.. చార్జీలు పెంచడానికి ఇది సరైన సమయం... ఈ విషయం చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. సిగ్గుపడాల్సిన విషయం అంతకంటే కాదు..’’ అని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. చార్జీల భారం భరించలేక.. ఇక వేచి ఉండే ఓపిక లేకనే పోస్ట్‌ పెయిడ్‌ చార్జీలను పెంచామని, అయినా చార్జీలు ఇంకా పెంచాల్సిన అవసరం ముందని ఆయన తెలిపారు. 
వోడాఫోన్‌ పూర్తిగా మునిగిపోయిన తరవాత కంపెనీలు చార్జీలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేసేలా సునీల్ మిట్టల్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  కంపెనీకి ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ఈ ఏడాది రూ. 200లకు చేరుతుందని ఆయన తెలిపారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించామని, ప్రమోటర్ల వాటా తగ్గించుకోమని స్పష్టం చేశారు. రైట్స్‌ ఇష్యూలో కేవలం తన వాటా మొత్తానికి సబ్‌స్క్రియిబ్‌ చేస్తామని ఆయన వివరించారు. సంస్థకు అప్పులు భారీగా పెరిగాయని... రైట్స్‌ ద్వారా సమీకరించే మొత్తం ఇండస్‌ పవర్‌లో వాటా పెంచుకునేందుకు ఉపయోగించమని తెలిపారు. సునీల్ మిట్టల్ ప్రకటన వార్తల ప్రభావం షేర్ మార్కెట్లో అప్పుడే కనిపించింది. ఎయిర్‌టెల్ షేర్లు 4.25శాతం పెరిగాయి. పరిశ్రమ మనుగడ కోసం ప్రభుత్వం పెట్టుబడిదారులు చార్జీల పెంపు విషయాన్ని ఆమోదించాలని సునీల్ మిట్టల్ కోరారు.