బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువగా ఉన్నాయని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. దమ్ముంటే గుజరాత్ లెక్కలు తీయాలని సవాల్ విసిరారు. నాలుగేండ్లల్లో గుజరాత్ లో 50 మరణాలు నమోదయితే.. బీహార్ లో 21 మరణాలు నమోదయ్యాయన్నారు. ద్వేషం..అబద్ధాలు ప్రచారం చేయడమే బీజేపీ ఎజెండా అన్నారు. నాలుగు నెలల క్రితం బీజేపీ నేతల ఇండ్లల్లో మద్యం దొరికింది వాస్తవం కాదా అని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.
బీహార్ లోని చప్రా లిక్కర్ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. రెండు రోజుల క్రితం సారణ్ జిల్లా చప్రా ప్రాంతంలోని ఇసువాపుర్ పీఎస్ పరిధిలో కల్తీ మద్యం తాగి పలువురు అనారోగ్యానికి గురయ్యారు. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యానికి గురైన మరికొందరికి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు లోక్ సభలోనూ చప్రా లిక్కర్ ఘటనపై దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు కల్తీ మద్యం మరణాలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇరు పక్షాలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
