చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడికి టికెట్ నిరాకరించింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నామలై నిరాకరించాడా లేక అధిష్టానమే టికెట్ ఇవ్వలేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కీలక నేత అయిన అన్నామలైకు బీజేపీ టికెట్ నిరాకరించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీట్ల పంపకంపై అన్నామలై అసంతృప్తి:
2026, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 27 మంది పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం (ఏప్రిల్ 3) విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మైలాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీ చేయనున్నారు.
అవనాశి స్థానం నుంచి కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు (ఉత్తర) నుంచి పోటీ బరిలోకి దిగనున్నారు. అయితే, ఈ జాబితాలో తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై పేరు లేకపోవడం గమనార్హం. తమిళనాడులో బీజేపీ ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు దక్కాయి. సీట్ల షేరింగ్, బీజేపీకి కేటాయించిన స్థానాలపై అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీజేపీకి బలం లేని స్థానాలు కేటాయించారని.. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. కానీ బీజేపీ అధిష్టానం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో అసంతృప్తికి గురైన అన్నామలై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టాక్. అంతేకాకుండా ప్రచార బాధ్యతలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తనకు కేటాయించిన ఆరు నియోజవర్గాల ప్రచార బాధ్యతల నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.
►ALSO READ | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్: మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ
అంతేకాకుండా తమిళనాడు ప్రస్తుత బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ నాయకత్వం పట్ల కూడా అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇక, అన్నాడీఎంకేతో పొత్తు అన్నామలైకు ఏ మాత్రం ఇష్టం లేదు. మొదటి నుంచే ఈ పొత్తును అతడు వ్యతిరేకిస్తున్నాడు. అన్నాడీఎంకే కూడా అన్నామలై తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో చేరాలంటే అన్నామలైను తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని అన్నాడీఎంకే షరతు విధించినట్లు టాక్. దీంతోనే అతడిని ఉన్నఫలంగా పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా నిలుస్తాడనుకున్న అన్నామలై అసలు పోటీనే చేయకపోవడం గమనార్హం. ఈ ప్రభావం బీజేపీపై ఏ మేర చూపిస్తుందో చూడాలీ.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడులో బీజేపీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)తో కలిసి పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 169 సీట్లలో పోటీ చేయనుండగా.. బీజేపీకి 27 స్థానాలు దక్కాయి. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కి 18 సీట్లు కేటాయించగా, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) 11 స్థానాల్లో పోటీ చేయనుంది. సౌత్‌లో పాగా వేయాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ తమిళనాడులో గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. తమిళనాడులో అధికార పీఠం దక్కించుకుని దక్షిణాదిలో క్రమంగా విస్తరించాలని వ్యూహాలు రచిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు నటుడు విజయ్ టీవీకే పార్టీ కూడా రేసులో ఉంది.
