బిహార్ సరన్ జిల్లాలోని చాప్రాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మంగళవారం రాత్రి ఆరుగురు చనిపోగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య మరింత పెరిగింది. మరికొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కల్తీ మద్యం కారణంగానే తమ వాళ్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లిక్కర్ తాగి ఇంటికెళ్తున్న టైంలోనే ఇలా జరిగిందని చెప్తున్నారు. బుధవారం కల్తీ మద్యం తాగిన ఇస్వాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా, మష్రక్ పీఎస్ పరిధిలోని యదు మోర్ గ్రామాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొందరి పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉండగా.. నితీశ్ హయాంలో కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా లభిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బిహార్ లో చోటుచేసుకున్న కల్లీ లిక్కర్ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ పై మండిపడుతున్నారు. ఆయన టైం అయిపోయిందని, ఆయన తన జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య తరచూ ఆయన కోపం తెచ్చుకుంటున్నారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ విమర్శించారు. మద్యం నిషేధానికి తాము సపోర్ట్ చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బిల్లుకి మద్దతు ఇచ్చామని, కానీ, చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం తారా కిశోర్ ప్రసాద్ విమర్శించారు.
