ప్లాస్టిక్ లాంటిదే..కానీ ప్లాస్టిక్ కాదు

ప్లాస్టిక్ లాంటిదే..కానీ ప్లాస్టిక్ కాదు

‘‘నిజమే.. ప్లాస్టిక్​ వాడితే ప్రాణాలు పోతాయని భయపెడితే తప్ప జనంలో మార్పు రాదు. నిజానికి ప్రాణాలు పోతున్న విషయం తెలిసి కూడా వాడుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్​ వెంటనే ఉండడం లేదు. అందుకే ప్లాస్టిక్​ వల్ల కలిగే హాని గురించి ప్రజలు అంత సీరియస్​గా ఉండడంలేదు. తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా వేయమని జీహెచ్​ఎంసీ డబ్బాలు ఇచ్చినా.. ఆ డబ్బాలను ఏదో అవసరానికి వాడుతున్నారే తప్ప, చెత్తను వేరుగా వేయడానికి మాత్రం ఉపయోగించడంలేదు. కానీ చాలామందికి తెలియదు.. చెత్తలో నుంచి బయటకు వచ్చే నీళ్లలాంటి లిక్విడ్​ చాలా డేంజరస్​.

తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా వేస్తే.. రీసైక్లింగ్​ ప్రక్రియ ఈజీ అవుతుంది. తడిచెత్త మరెన్నింటికో ఉపయోగపడుతుంది. కానీ ప్రజల నుంచి సహకారం లేకపోవడం వల్లే ప్లాస్టిక్​ రీసైక్లింగ్ పూర్తిస్థాయిలో సాధ్యం కావడంలేదు. ప్రజల్లో మార్పు వచ్చేవరకు ప్లాస్టిక్​ నుంచి ముప్పును తప్పించడం అసాధ్యం’’ అంటున్నారు  ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్​ డాక్టర్​ సయెదా అజీమ్​ ఉన్నిసా. గత 18 సంవత్సరాలుగా ‘సాలిడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్’​పై పరిశోధనలు చేస్తున్న ఆమె ఇటీవలే ‘బయోడీగ్రేడబుల్​ మెటీరియల్’ను తయారుచేశారు. ఆహార వ్యర్థాల నుంచి తయారుచేసిన ఈ మెటీరియల్​ ప్లాస్టిక్​లాంటిదే,  కానీ ప్లాస్టిక్​ కాదంటారామె. నెలరోజుల్లోనే పూర్తిగా భూమిలో కలిసిపోయే ఈ కొత్తరకం ‘ప్లాస్టిక్’​ గురించి ప్రొఫెసర్​ ఉన్నిసా చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..

ప్లాస్టిక్​ లేకుండా రోజు గడవడం కష్టమే..

ప్లాస్టిక్​ వాడకుండా ఉండలేని రోజును ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే.. మార్నింగ్​ లేవగానే పళ్లు తోముకోవడానికి వాడే బ్రష్​ నుంచే మన ప్లాస్టిక్ వాడకం మొదలవుతుంది. ఆ తర్వాత బాత్రూమ్​లో సబ్బుపెట్టె, తల దువ్వుకునే దువ్వెన, జేబుకున్న పెన్ను, చేతిలో ఉన్న ఫోను, కళ్లకు పెట్టుకున్న స్పెక్ట్స్​, చెవుల్లో పెట్టుకున్న ఇయర్​ బడ్స్​, చేతికున్న వాచ్​, చూస్తున్న టీవీ, దాన్ని ఆపరేట్​ చేసే రిమోట్​, కూర్చున్న చైర్​, వేసుకున్న చెప్పులు, తొడుక్కున్న షర్ట్​, దానికున్న బటన్స్, నడిపే బైక్​, దాన్ని ఆన్​ చేసే ‘కీ’, ఆఫీస్​లో కంప్యూటర్ మానిటర్​​, కీబోర్డ్​, మౌస్​, తాగే వాటర్​ బాటిల్​, లంచ్​బాక్స్​, వెలుగునిచ్చే బల్బు, దానికి కరెంట్​ సప్లయ్​ చేసే వైర్​, ఆన్​ చేసే స్విచ్​, చల్లగాలికోసం వాడే ఫ్యాన్​, ఏసీ.. ఇలా చెప్పుకుంటూపోతే  మనం వాడుతున్న ప్లాస్టిక్​ వస్తువుల లిస్ట్​ ఎండ్​ కావడం కష్టమే. అంతెందుకు మనం తింటున్న ఆహారంలో కూడా ప్లాస్టిక్​ ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ప్లాస్టిక్​ను టచ్​ చేయకుండా ఒక్కరోజు కూడా గడపడం లేదు. అంతలా ప్లాస్టిక్​ మన జీవితాల్లో భాగమైపోయింది.

రోజుకు 45వేల టన్నుల చెత్త

కేవలం ప్లాస్టిక్​ వాడకం వల్లే చెత్తను సరిగ్గా వినియోగించలేకపోతున్నాం. ఇప్పటికే హైదరాబాద్​లో ఆటోనగర్​, గందంగూడ, జవహర్​నగర్​ డంప్​ యార్డ్​లు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు 45,000 మెట్రిక్​ టన్నుల చెత్త అదనంగా దీనికి తోడవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రేపటి నుంచి చెత్తను ఎక్కడ డంప్​ చేస్తారు? డంప్​యార్డుల నుంచి వచ్చే దుర్వాసన, హానికరమైన విషవాయువులు చుట్టు పక్కల ఉంటున్న ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. ఒకవేళ ఈ చెత్తలో ప్లాస్టిక్​ కవర్లు వంటివి లేకపోతే దానిని ఎన్నోరకాలుగా ఉపయోగించుకునే అవకాశముంది. గత రెండు దశాబ్దాలుగా సాలిడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​ మీద పరిశోధనలు చేస్తున్నా. ఆ డంప్​యార్డులను చూసినప్పుడల్లా అనిపించేది.. ఈ చెత్త నుంచే ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయాన్ని తయారుచేస్తే ఎలా ఉంటుంది? అని. ఎన్నో ప్రయోగాల తర్వాత ఆ చెత్త నుంచి స్టార్చ్​ను సేకరించగలిగాం. ఆ స్టార్చ్​నే ‘బయోడీగ్రేడబుల్​ మెటీరియల్​’గా మార్చాం.

కెమికల్స్​ జోలికి వెళ్లలేదు..

స్టార్చ్​ను బైండింగ్​ మెటీరియల్​గా మార్చాం. దీనికోసం కెమికల్స్​ను కలపలేదు. చెత్త నుంచి బయోడీగ్రేడబుల్​ మెటీరియల్​ ఇప్పటికే తయారుచేసినా.. స్టార్చ్​ను బైండింగ్​ మెటీరియల్​గా మార్చేందుకు కొన్నిరకాల కెమికల్స్​ను కలిపారు. మేం మాత్రం హానికరమైన రసాయనాల జోలికే వెళ్లకుండా తయారుచేశాం. ఈ మెటీరియల్​ను సీపెట్​(సెంట్రల్‌​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ప్లాస్టిక్స్​ ఇంజనీరింగ్​ అండ్​ టెక్నాలజీ)కు  పంపించాం. అక్కడ ప్లాస్టిక్స్​కు సంబంధించిన అనాలసిస్​ జరుగుతుంది. అయితే మేం తయారుచేసిన ఈ బయోడీగ్రేడబుల్​ మెటీరియల్​కు ప్లాస్టిక్​కు ఉండే ఎలాస్టిసిటీ ఉన్నట్టుగా రిపోర్ట్​ వచ్చింది. అంత ఈజీగా బ్రేక్​ కాదని కూడా సీపెట్​ సైంటిస్టులు చెప్పారు. ఈ మెటీరియల్​తో గిన్నెలు, గ్లాస్​లు, ప్లేట్​లు, కవర్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా తయారుచేయొచ్చని సీపెట్​ సైంటిస్టులు చెప్పారు.

మట్టిలో కలవడానికి నెలరోజులు చాలు..

పూర్తిగా ఆహార వ్యర్థాలతోనే తయారుచేసిన ఈ మెటీరియల్​ డీగ్రేడ్​ కావడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. కేవలం 25 రోజుల్లోనే మట్టిలో కలిసిపోతుంది. దీనిని స్వయంగా మేమే సెమ్(స్కానింగ్​ ఎలక్ట్రాన్​ మైక్రోస్కోప్​) ద్వారా పరిశీలించాం. ఒక వైపు ప్లాస్టిక్​ను, మరోవైపు మేం తయారుచేసిన మెటీరియల్​ను పెట్టి నెలరోజులపాటు పరిశీలించాం. అయితే ప్లాస్టిక్​ ఏమాత్రం కరిగిపోలేదు. మేం తయారుచేసిన మెటీరియల్​ మాత్రం నెలరోజుల్లో పూర్తిగా మట్టిలో కలిసిపోయింది.

ఎరువుగా కూడా..

ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు, ముడిపదార్థాలేవీ వాడకుండా ఈ మెటీరియల్​ను తయారుచేయొచ్చు. వాడిన తర్వాత మొక్కలకు, పంటపొలాలకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఈ ఎరువుతో పండిన పంటలు కూడా ఆరోగ్యకరమైనవే. ఎందుకంటే ఈ ఎరువు వాడిన తర్వాత ఎటువంటి ఫెర్టిలైజర్స్​ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే.. ఓ రకంగా ఆర్గానిక్​ పంటలు పండించిన వాళ్లమవుతాం.

ఐఐటీ గువాహటి సైంటిస్టులు కూడా..

ఐఐటీ గువాహటి సైంటిస్టులు కూడా ఇలాంటి బయో ప్లాస్టిక్​నే తయారుచేశారు. అయితే ఈ ప్లాస్టిక్​ తయారీకి అవసరమైన ముడిపదార్థాన్ని మాత్రం చెరకు, చొప్ప వంటి పంట వ్యర్థాల నుంచి సేకరించారు. పంట వ్యర్థాల నుంచి తీసిన ముడిపదార్థాన్ని పాలీమరైజేషన్​ అనే ప్రక్రియ ద్వారా ప్లాస్టిక్​గా మార్చారు. ఇది సాధారణ ప్లాస్టిక్​కు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు ఐఐటీ గువాహటి ప్రొఫెసర్​  విమల్​ కతియార్. ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్​ కంటే కూడా తక్కువ ఖర్చుకే ప్లాస్టిక్​ను తయారుచేసే అవకాశముందని, ఇది ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయం అవుతుందంటున్నారు ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్​గా వ్యవహరించిన డాక్టర్​ టీజీ సీతారాం. దీనిని రూమ్​ టెంపరేచర్​లో ఉంచినా ఆరు నుంచి ఎనిమిది నెలల్లో భూమిలో కలిసిపోతుంది అని చెప్పారు. ఇదే ఈ బయోప్లాస్టిక్​కు ఉన్న ప్రత్యేకతగా అయన చెప్పారు.

ఇదిలాఉంటే…‘ సాధారణ ప్లాస్టిక్​ను​, బయోప్లాస్టిక్​ రీసైకిల్​ అయ్యే డబ్బాలో వేస్తే బయోప్లాస్టిక్​ భూమిలో కలిసిపోయే ప్రక్రియ సరిగ్గా జరగదు. అలాగే బయోప్లాస్టిక్​ రీసైకిల్​​ అయ్యే డబ్బాలో సాధారణ ప్లాస్టిక్​ వేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్​ను అందుబాటులోకి తెచ్చేముందే.. సాధారణ ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాలి. అప్పుడే బయోప్లాస్టిక్​ వల్ల ఫలితాలుంటాయి. లేదంటే ఎటువంటి ప్రయోజనం ఉండద’ని చెబుతున్నారు ప్రముఖ పర్యావరణవేత్త నసా అలీ.