మోదీ, షాల ఆలోచన ఇదే.. బీజేపీ గెలిస్తే జరిగేదదే: రాహుల్​ గాంధీ

 మోదీ, షాల ఆలోచన ఇదే.. బీజేపీ గెలిస్తే జరిగేదదే: రాహుల్​ గాంధీ
  • 20–25 మంది బిలియనీర్లతోనే దేశాన్ని నడపాలనుకుంటున్నరు 
  • రాజ్యాంగాన్ని ఎన్నటికీ రద్దు కానివ్వబోమని ప్రకటన 
  • మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ మాజీ చీఫ్ స్పీచ్ 

భిండ్ (మధ్యప్రదేశ్): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని చించి పారేస్తారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలోని పేదలు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల హక్కులను కాలరాస్తారని అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్ లోని భిండ్ లోక్ సభ నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫూల్ సింగ్ బరాయియా తరఫున రాహుల్ ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా భిండ్ జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని ప్రజలకు చూపుతూ ఆయన ప్రసంగం చేశారు. ఈ ఎన్నికలు సాధారణమైనవి కావని.. రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు.  ‘‘పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం వల్లే భూమి హక్కు, రిజర్వేషన్, ఉపాధి హామీ, ఇతరత్రా అనేక హక్కులు దక్కుతున్నాయి. ఒకవేళ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దానిని చించి అవతల పారేస్తుంది” అని ఆయన ప్రజలను హెచ్చరించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాళ్ల ఎంపీలు ఇదే ఆలోచనను బయటపెట్టారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పుస్తకం (రాజ్యాంగం) చించి పారేయాలని వాళ్లు అనుకుంటున్నారు. కేవలం 20–25 మంది బిలియనీర్లతోనే దేశాన్ని నడపాలని చూస్తున్నారు” అని రాహుల్ గాంధీ చెప్పారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకమైనందుకే ప్రైవేటీకరణ..  

బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకపోతే.. రైల్వేలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర రంగాలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తోందని రాహుల్​ ప్రశ్నించారు. సైన్యంలో అగ్నివీర్ పథకాన్ని కూడా ఎందుకు తెచ్చారో చెప్పాలన్నారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ నేతలు కలలు కంటున్నారు. కానీ రాజ్యాంగం అనేది దేశంలోని పేద ప్రజలకు ఆత్మలాంటిది. దానిని ఎవరూ టచ్ చేయలేరు.

 ప్రపంచంలో ఏ శక్తీ దానిని మార్చలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్, కాంగ్రెస్, ప్రజలు కలిసి బ్రిటిష్ వారితో పోరాడి రాజ్యాంగాన్ని తెచ్చుకున్నారు. ప్రజల గొంతుకగా ఉన్న దానిని ఎన్నటికీ రద్దు కానివ్వం” అని రాహుల్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే మహాలక్ష్మి స్కీం కింద కోట్లాది మంది మహిళలకు ఏడాదికి రూ. లక్ష సాయం అందించి వారిని లక్షాధికారులను చేస్తామన్నారు. బీజేపీ గెలిస్తే ఇండస్ట్రియలిస్టులను మాత్రమే బిలియనీర్లుగా మారుస్తుందన్నారు.