సినిమా కాదు పాలిటిక్స్: పవన్కు డిజాస్టర్.. చిరంజీవికి మిక్డ్స్ టాక్.. సేమ్ ఫార్ములాతో ఇప్పుడు విజయ్ !

సినిమా కాదు పాలిటిక్స్: పవన్కు డిజాస్టర్.. చిరంజీవికి మిక్డ్స్ టాక్.. సేమ్ ఫార్ములాతో ఇప్పుడు విజయ్ !

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో.. తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై అప్పుడే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రచారం జోరందుకుంది. 

2019లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో పోటీ చేసిన తరహాలో తమిళనాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు జోసెఫ్ విజయ్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తమిళనాడులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకటి చెన్నై సిటీ పరిధిలోనిదేనని టాక్. చెన్నై పరిధిలోని వేళచ్చేరి, విరుగంబక్కం నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయడం ఖాయం అని తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక మరో నియోజకవర్గం విషయానికొస్తే.. విలుప్పురంలోని విక్రవాండి, నాగపట్నంలోని వేదారణ్యం, కరూర్లోని వేదసందూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను అంచనా వేసి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేయాలని పార్టీ ముఖ్యులకు సూచించినప్పటికీ తుది నిర్ణయం మాత్రం విజయ్ తీసుకుంటారని TVK పార్టీ ముఖ్యులు తెలిపారు. విజయ్ అనే పేరులో V ఉండటంతో ఆయన పోటీ చేసే నియోజకవర్గాలు కూడా Vతో మొదలయ్యేలా ఆలోచన చేశారు. V ఫర్ విజయ్, V ఫర్ విక్టరీ అనే నినాదంతో ముందుకెళ్లాలని TVK భావిస్తోంది. బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా భావిస్తున్న విజయ్.. రాజకీయ శత్రువుగా మాత్రం DMKతోనే యుద్ధానికి సిద్ధమవుతుండటం గమనార్హం. ఫిబ్రవరి 2, 2024న విజయ్ తన రాజకీయ పార్టీని స్థాపించారు. ఎన్నికల సంఘం ఆయన పార్టీకి ‘విజిల్’ సింబల్ను కేటాయించింది.

ఇదిలా ఉండగా.. సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇది కొత్తేం కాదు. అయితే.. ఈ ఫార్ములా కొందరికి కలిసొచ్చింది. మరికొందరికి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇంకొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. సీనియర్ ఎన్టీఆర్ రెండు చోట్ల పోటీ చేసి గెలిచారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో.. తిరుపతి, పాలకొల్లు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓడిపోయారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో.. గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమిని చవిచూశారు. పవన్ కల్యాణ్కు డిజాస్టర్ ఫార్ములాగా మిగిలిపోయిన ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పోటీ వ్యూహం.. జోసెఫ్ విజయ్కు కలిసొస్తుందో.. లేదో.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తేల్చబోతున్నాయి.