ఢిల్లీకి ప్రపంచ ఐటీ, ఏఐ దిగ్గజాలు.. ఒక్క రాత్రి హోటల్ అద్దె రూ.32 లక్షలు.. అయినా నో రూమ్స్..!

ఢిల్లీకి ప్రపంచ ఐటీ, ఏఐ దిగ్గజాలు.. ఒక్క రాత్రి హోటల్ అద్దె రూ.32 లక్షలు.. అయినా నో రూమ్స్..!

AI Impact Summit: ఇప్పుడు ప్రపంచం మెుత్తం నడుస్తోంది తెలిసో తెలియకో ఎక్కువగా ఏఐ వల్లనే. సాధారణ ప్రజలు సైతం తాము రోజువారీ పనుల్లో తెలియకుండానే ఏఐ ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. దీంతో రానున్న ఏఐ యుగం.. దాని పరిణామాలు, అభివృద్ధి గురించి ప్రపంచ వ్యాప్తంగా భారీగానే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భారత రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయబడిన ఏఐ మెగా ఈవెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫిబ్రవరి 19, 20న ఢిల్లీ వేదికగా జరగనున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' దేశ రాజధానిని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేసింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్‌మాన్ వంటి దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరవుతుండటంతో ఢిల్లీలో ముందెన్నడూ లేని విధంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఢిల్లీలోని లగ్జరీ హోటల్ రూమ్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులే కాదు, సంపన్నులు కూడా ముక్కున వేలేసుకునేలా ఒక రాత్రి హోటల్ స్టే ధర రూ.30 లక్షలు దాటేసింది.

ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు

ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో విలాసవంతమైన గార్డెన్ లగ్జరీ సూట్ ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఫిబ్రవరి 16 నుంచి 20 మధ్య ఈ రూమ్ ధర ఒక రాత్రికి రూ.27.55 లక్షలుగా ఉండగా.. టాక్సులతో కలిపి ఆ బిల్లు సుమారు రూ.32 లక్షలకు చేరుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వాలెంటైన్స్ డే నాటి ధరల కంటే ఇవి 1,500 శాతం ఎక్కువ. సాధారణ రోజుల్లో రూ.2 లక్షలు ఉండే ఈ గదికి ఏఐ సమ్మిట్ కారణంగా ఇంతటి డిమాండ్ ఏర్పడింది.

దాదాపు అన్నీ 'సోల్డ్ అవుట్'

కేవలం తాజ్ మాత్రమే కాదు.. లీలా ప్యాలెస్‌లో మహారాజా సూట్ ధర రూ.6.9 లక్షలు పలుకుతుండగా, ది ఒబెరాయ్‌లో రూ.5.5 లక్షలుగా ఉంది. హయత్ అందాజ్ ఢిల్లీలో సిగ్నేచర్ సూట్ కోసం రూ.3.86 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. లలిత్, జేపీ వసంత్ కాంటినెంటల్, ఈరోస్ వంటి హోటళ్లు ఇప్పటికే 95 శాతం పైగా నిండిపోయాయి. చాలా చోట్ల నో రూమ్స్ అవైలబుల్ అనే బోర్డ్స్ కనిపిస్తున్నాయి. 100కు పైగా దేశాల నుండి సుమారు 35వేల మంది ప్రతినిధులు రానుండటంతో తాజా పరిస్థితి ఏర్పడిందని హోటల్ వర్గాలు చెబుతున్నాయి. 

ఎందుకీ రేంజ్ డిమాండ్?

ఈ మీటింగ్ కోసం కేవలం టెక్ దిగ్గజాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు ఢిల్లీకి తరలివస్తున్నారు. ixigo డేటా ప్రకారం.. ఢిల్లీ హోటల్ సెర్చ్‌లు ఒక్కసారిగా 6 రెట్లు పెరిగాయి. చాలా కంపెనీలు బల్క్ బుకింగ్స్ చేసుకోవడం.. చివరి నిమిషంలో వస్తున్న ప్రముఖుల కోసం హోటళ్లు ప్రీమియం ధరలను వసూలు చేయడం దీనికి ప్రధాన కారణాలుగా మారాయి. దీనివల్ల ఢిల్లీలో హోటల్ బిజినెస్ గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

ఈ ఏఐ సమ్మిట్ కేవలం హోటల్ వ్యాపారానికే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించింది. నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరగడం గమనార్హం. కేవలం సదస్సుకే పరిమితం కాకుండా.. వచ్చిన గెస్ట్స్ జిమ్ కార్బెట్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్లాన్ చేసుకుంటుండటంతో టూరిజం రంగానికి కూడా భారీ ఊతం లభిస్తోంది. మొత్తానికి ఏఐ సమ్మిట్ ఢిల్లీ ఆతిథ్య రంగానికి 'గోల్డెన్ డేస్' తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు.