ప్రధాని మోదీ కుట్రలు చేస్తుండు..గోదావరి నీళ్లను తమిళనాడుకు ఎత్తుకుపోతడట: కేసీఆర్​

ప్రధాని మోదీ కుట్రలు చేస్తుండు..గోదావరి నీళ్లను తమిళనాడుకు ఎత్తుకుపోతడట: కేసీఆర్​
  • అయినా సీఎం రేవంత్ కిక్కురుమనడం లేదు
  • కొత్తగూడెం జిల్లాను తీసేస్తానని సీఎం​ క్లియర్​గా చెప్తుండు
  • అదానీ బొగ్గు దిగుమతికి ప్రధాని ఒత్తిడి తెచ్చినా నేను ఒప్పుకోలే
  • సింగరేణిని ముంచేందుకు కాంగ్రెస్​ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రోడ్​ షో 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మన గోదావరి నీళ్లను మహారాష్ట్ర, తమిళనాడుకు ఎత్తుకుపోయేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​ మండిపడ్డారు. గోదావరి నీళ్లు అటు మళ్లించుకుంటే మన బతుకేం కావాలని అన్నారు. మన నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తున్న మోదీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఖమ్మం, మహబూబాబాద్ ​బీఆర్ఎస్ క్యాండిడేట్లు నామా నాగేశ్వరరావు, మాలోత్​ కవితను గెలిపించాలని కోరుతూ మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..

ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి తమిళనాడుకు నీటిని ఎత్తుకపోతానంటూ మోదీ చెప్తున్నారని అన్నారు. తెలం గాణకు గోదావరి నీళ్లు లేకుండా చేస్తానని మోదీ అంటుంటే సీఎం రేవంత్​ కిక్కురుమనడం లేదని తెలిపారు. మోదీది దరిద్రమైన, దుర్మార్గమైన పాలన అని విమర్శించారు.  పదేండ్ల బీజేపీ పాలనలో ఒక్క హామీ నెరవేరలేదని చెప్పారు. మతాల పేరిట ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని దుయ్యబట్టారు. పదేండ్లలో రూపాయి విలువ ఘోరంగా  పడిపోయిందని చెప్పారు. వ్యవసాయ బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టాలని తనపై మోదీ ఒత్తిడి తెచ్చారని

తలతెగిపడ్డా మీటర్లు పెట్టనని తెగేసి చెప్పానన్నారు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టేందుకు మోదీ చూస్తున్నారని, తస్మాత్​ జాగ్రత్త అని హెచ్చరించారు. అదానీ దిగుమతి చేసుకునే ఆస్ట్రేలియా బొగ్గును సింగరేణి కోసం తీసుకోవాలని పట్టుబట్టినా తాను ఒప్పుకోలేదని అన్నారు. బీఆర్ఎస్​ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. మోదీ బడేభాయ్​.. రేవంత్​ చోటేభాయ్​ అని అన్నారు. దమ్ముంటే రేవంత్​పై ఈడీ, ఐటీ, సీబీఐని దించాలని మోదీకి కేసీఆర్​ సవాల్​ విసిరారు.

ముఖ్య నేతలతో రివ్యూ

కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్​లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్​సభ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్​ రివ్యూ నిర్వహించారు. ఈ రెండు లోక్​సభ స్థానాలను గెలుచుకునేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై నాయకులతో చర్చించారు. కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని నేతలకు సూచించారు.  

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతేది?  

 అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని కేసీఆర్ ​విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్​ చెప్పినా.. ఇప్పటివరకూ చేయలేదని అన్నారు. తమ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, రెప్పపాటు కూడా కరెంట్​ పోలేదని చెప్పారు.  పినపాక నియోజకవర్గంలోని దొంగతోగు వంటి మారుమూల చిన్న గిరిజన గ్రామానికి కూడా మిషన్​ భగీరథ నీళ్లు అందించామని తెలిపారు. గిరిజన బిడ్డలకు త్రీ ఫేస్​ కరెంట్​ఇప్పించామని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా లక్షా 50 వేల పోడు పట్టాలను ఇప్పించామని తెలిపారు.

పరిపాలనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేస్తే దాన్ని తీసేస్తామని రేవంత్​ క్లియర్​గా చెప్తున్నారని అన్నారు. ఫ్రీ బస్​తో ఆటోరిక్షాల వాళ్లు రోడ్డున పడ్డారన్నారు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని స్టూడెంట్స్​సచ్చిపోతున్నా కాంగ్రెస్​ ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. సింగరేణి చరిత్రలోనే తాము అత్యధికంగా బోనస్​ ఇప్పించామని, స్పెషల్ ​ఇంక్రిమెంట్​ ఇచ్చామని కేసీఆర్​ చెప్పారు.

ఇప్పుడు సింగరేణిని ముంచేలా కాంగ్రెస్​ చర్యలున్నాయని ఆరోపించారు. ఖమ్మం, మహబూబాబాద్​ బీఆర్ఎస్​ క్యాండిడేట్లు నామా నాగేశ్వరరావు, మాలోత్​ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.