ఇయ్యాల తెలంగాణ పాలక్​లతో బీఎల్ సంతోష్​ భేటీ

ఇయ్యాల తెలంగాణ పాలక్​లతో బీఎల్ సంతోష్​ భేటీ

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో అత్య ధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా ‘‘విస్తారక్’’ (ఫుల్​టైమర్స్)లు పార్టీని సంస్థాగతంగా బలో పేతం చేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ సహ కార్యదర్శి సతీశ్ సూచించారు. ముఖ్యంగా దక్షిణాదిన జరిగే ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. దేశానికి బీజేపీ తప్ప మరో పార్టీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. 

117 మంది విస్తారక్​లు హాజరు

16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్తగా నియమితులైన 117 మంది విస్తారక్​లు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దేశంలో పార్టీ బలహీనంగా ఉన్న ఎంపీ స్థానాలను గుర్తించిన బీజేపీ హైకమాండ్.. ఆ నియోజకవర్గాలకు నియమించిన విస్తారక్ లతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. విస్తారక్ ల విధులు, బాధ్యతలు, పార్టీలో వారి పాత్రను ఇతర నేతలు వివరించారు. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, లోకల్ గా ఉన్న కార్యకర్తలు, లీడర్లతో ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావుడే, పార్టీ స్టేట్​ ప్రెసిడెంట్​ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేతలు డీకే అరుణ, మురళీధర్ రావు పాల్గొన్నారు.

ఇయ్యాల విస్తారక్​లతో నడ్డా వర్చువల్​ భేటీ

గురువారం ఉదయం బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​ విస్తారక్​లతో మాట్లాడుతారు. లంచ్ తర్వాత జరిగే ముగింపు సమావేశంలో పార్టీ చీఫ్​ జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్​గా కొన్ని సూచనలు చేస్తారు. ఆ తర్వాత తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విస్తారక్ లు, ప్రభారీలు, కన్వీనర్లు, పాలక్ లతో కూడా బీఎల్ సంతోష్ భేటీ అవుతారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేస్తారు.