బషీర్‌బాగ్, వెలుగు: బ్లాక్‌మనీ నెట్‌వర్క్‌ల నిర్మూలనకు చార్టర్డ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ న్యాయవాదులు సహకరించాలని తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్(ఇన్వెస్టిగేషన్స్) రాజర్షి ద్వివేది కోరారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఆయాకర్ భవన్‌లో గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ.. వ్యాపార సంస్థలకు సాయం చేయడంలో సీఏలు, పన్ను వివాదాల పరిష్కారంలో ట్యాక్స్ న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
పన్ను చట్టాలు తరచుగా మారుతున్న నేపథ్యంలో కొత్త సవరణలు, నోటిఫికేషన్‌లు, నిబంధనలపై క్లయింట్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత చార్టర్డ్ అకౌంటెంట్లదేనని పేర్కొన్నారు. ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వేముల, కార్యదర్శి ఆశిష్ జోషి, సలహాదారులు రాందేవ్ బుత్డా, అమృత్ కుమార్ కోట, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
