‘హిందూ-ముస్లిం’ సామరస్యంపై సర్ఫ్ఎక్సెల్ యాడ్.. ట్విట్టర్ లో దుమారం

‘హిందూ-ముస్లిం’ సామరస్యంపై సర్ఫ్ఎక్సెల్ యాడ్.. ట్విట్టర్ లో దుమారం

హోళీ.. రంగుల పండుగ. చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా కలిసి హుషారుగా జరుపుకొనే ‘కలర్ ఫుల్’ ఫెస్టివల్. ఆ రోజు సప్తవర్ణాల ఇంద్రధనస్సు మన దుస్తులపైకి వచ్చి చేరుతుంది. మరి ఆ రేంజ్ లో రంగుల్లో ఆడిన తర్వాత బట్టలను శుభ్రం చేసుకోవాలి కదా!  దీన్ని బేస్ గా తీసుకుని డిటర్జెంట్ పౌడర్ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ సర్ఫ్ ఎక్సెల్ ఓ యాడ్ చేసింది. హోళీ కాన్సెప్ట్ తో చేసిన ఆ ప్రకటన ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ గా మారింది.  అయితే బాయ్ కాట్ సర్ఫ్ ఎక్సెల్ హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతోంది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఈ యాడ్ ఉందంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

హిందూ – ముస్లిం  ఐక్యతను చూపుతూ రంగుల పండుగ మనుషుల్ని దగ్గర చేస్తుందనే థీమ్ తో సర్ఫ్ ఎక్సెల్ ఈ యాడ్ చేసింది. ఒక్క నిమిషంలో ముగిసే ప్రకటనలో అపార్టుమెంట్ లలో పిల్లలంతా హుషారుగా హోళీ ఆడుతుంటారు. ఓ చిన్నారి తెల్లటి టీ షర్ట్ తో సైకిల్ పై వాళ్ల మధ్యకు వస్తుంది. పిల్లలు రంగులు వేయడం మొదలు పెట్టగానే.. ఈ కొంచెమేనా అంటూ ఉడికస్తూ వాళ్ల దగ్గర ఉన్న రంగులు మొత్తం అయిపోయే వరకు సరదాగా హోళీ ఆడుతుంది. మొత్తం అయిపోయాయని పిల్లలు నిరాశగా ఉండే టైమ్ లో ఆ చిన్నారి తన ముస్లిం స్నేహితుడి దగ్గరకు వెళ్లి రంగులన్నీ అయపోయాయి రా.. అని పిలుస్తుంది. తెల్లని దుస్తుల్లో ఉన్న ఆ పిల్లాడిని సైకిల్ పై మసీదుకు తీసుకెళ్లేందుకు బయలు దేరుతుంది. ఆ ఇద్దరూ సైకిల్ పై బయటకు రాగానే ఓ పిల్లాడు బిల్డింగ్ పైనుంచి రంగుతో నిండిన బెలూన్ వారిపైకి విసిరే ప్రయత్నం చేయగా.. పక్కనే ఉన్న చిన్నారి వద్దని ఆపుతుంది. ఆ చిన్నారి మసీద్ దగ్గర దింపగానే.. నమాజ్ అయ్యాక కలుస్తా అని చెబుతాడా పిల్లాడు. దానికి ఆ చిన్నారి వచ్చాక రంగుల్లో తడవాల్సిందే అంటూ వెళ్తుంది. దీనికి బ్యాగ్రౌండ్ లో హిందూ సాంగ్ నడుస్తుంటుంది. ‘మంచి కారణం కోసం మరక అయితే.. ఆ మరక మంచిదే’ అనే ట్యాగ్ లైన్ తో యాడ్ ముగుస్తుంది.

ఫిబ్రవరి 27న ఈ యాడ్ ను సర్ఫ్ ఎక్సెల్ యూ ట్యూబ్ లో పెట్టింది. ఇప్పటి వరకు 80 లక్షల మంది దీన్ని చూశారు.  రంగుల పండుగ నాడు మత సామరస్యం వెల్లివిరిసిందంటూ యూ ట్యూబ్ లో కామెంట్స్ వెల్లువెత్తాయి. హిందూ ముస్లిం భాయి భాయూ అంటూ వందల మంది కామెంట్లు పెట్టారు. హిందువులు ఎప్పుడూ ముస్లిం సోదరులకు అండగా ఉంటారని కొందరు అన్నారు. ఓ నెటిజన్ అయితే ఈ యాడ్ తో ఎంత డబ్బు సంపాదించారో తెలియదు కానీ, హిందూ ముస్లిం ఐక్యతను కోరుకునే కోట్ల హృదయాలను గెలుచుకున్నారంటూ కామెంట్ చేశాడు.

ట్విట్టర్ లో దుమారం

అయితే ట్విట్టర్లో మాత్రం సర్ఫ్ ఎక్సెల్ యాడ్ పై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. బాయ్ కాట్ సర్ఫ్ ఎక్సెల్ హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతోంది ఈ యాడ్. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, లవ్ జీహాదీని ప్రోత్సాహించేలా ఉందని ఓ నెటిజన్ మండిపడ్డారు. హోళీ రంగులను మరకలు అనడం సరికాదని, అలాగే అమ్మాయి, అబ్బాయిని ఎంచుకున్న తీరు కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, ఆ ఎంపిక రివర్స్ లో జరగాలని ట్వీట్ చేశారు.

ఈ యాడ్ చేసినట్లే ఫర్ఫ్ ఎక్సెల్ కంపెనీ మొహరం పండుగపై కూడా ఓ ప్రకటన చేయాలని, అందులో రక్తపు మరకలు పడకుండా రాహుల్ ను రజియా అనే అమ్మాయి గుడికి తీసుకెళ్తున్నట్లుగా చూపాలని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

ముస్లిం బాలికల్నిసర్ఫ్ ఎక్సెల్ అవమానించిందని మరో నెటిజన్ అన్నారు. ముస్లిం అబ్బాయిలు నమాజ్ చేసుకోవడానికి హిందూ అమ్మాయిల సాయం కావాలి అన్నట్లుగా ఈ యాడ్ ఉందని, ఇది మొత్తం ముస్లిం పిల్లల్ని అవమానించడమేనని ట్వీట్ చేశారు.

యాడ్ ను కొందరు తప్పుపడుతోంటే మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఎవరి పండుగలు వారు జరుపుకొనే హక్కు ఉంటుందని, ఇతర మతాల పండుగలను స్నేహభావంతో చేసుకోవాలని ఓ నెటిజన్ అన్నారు. సర్ఫ్ ఎక్సెల్ మంచి మెసేజ్ ఇచ్చిందంటూ ట్వీట్ చేశారు.

‘ఈ యాడ్ లో తప్పేంలేదు. ఎందుకు ప్రతి దాన్నీ సీరియస్ గా తీసుకుంటున్నారు. లేనిపోని అర్థాలు తీసుకోవడం ఎందుకు? సింపుల్ గా ఆలోచించి.. కూల్ గా ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.