బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో శానిటేషన్ కుంభకోణం.. ప్రాసెస్ చేయని చెత్తకు రూ. 313 కోట్ల చెల్లింపులు:  కాగ్ నివేదికలో వెల్లడి

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో శానిటేషన్ కుంభకోణం.. ప్రాసెస్ చేయని చెత్తకు రూ. 313 కోట్ల చెల్లింపులు:  కాగ్ నివేదికలో వెల్లడి
  • డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ జరగకపోయినా కాంట్రాక్టర్​కు చెల్లింపులు
  • ఎన్విరాన్మెంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేయలే

హైదరాబాద్ సిటీ, వెలుగు: గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్​లో భారీ శానిటేషన్ స్కామ్​జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం.. పొడి చెత్తను అసలు ప్రాసెస్ చేయనప్పటికీ సుమారు 44.16 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల నిర్వహణ కోసం ఒక కాంట్రాక్ట్ సంస్థకు రూ. 313.20 కోట్లు అక్రమంగా చెల్లించారు. 

ఫిబ్రవరి 2012 నుంచి జూలై 2020 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు కాగ్ గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక నిధిని కూడా సదరు సంస్థ ఏర్పాటు చేయలేదని తప్పుబట్టింది.

ఆదాయ వనరులపై నిర్లక్ష్యం.. ఖజానాకు గండి

ఆదాయ వనరుల వసూళ్లలో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ విఫలమవ్వడంపై కాగ్ అసహనం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సహా పది స్థానిక సంస్థల నుంచి రావాల్సిన రూ. 47.77 కోట్ల టిప్పింగ్ ఫీజును (చెత్త రవాణా చార్జీలు) వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొంది. రైల్వే స్టేషన్ల వంటి భారీ వ్యర్థాల ఉత్పత్తిదారుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయకపోవడం వల్ల గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆక్షేపించింది. 

భవన నిర్మాణ అనుమతుల సమయంలో వసూలు చేయాల్సిన ‘ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజు’ సక్రమంగా తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 2.29 కోట్ల గండి పడిందని వివరించింది. 37 శాతం నిధులు అసలు వినియోగం కాకుండానే మిగిలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

నిర్వహణ లోపాలు.. కుప్పలుగా పేరుకుపోయిన చెత్త

నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలులో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని కాగ్ తెలిపింది. వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు కాకపోవడం, మానిటరింగ్ టీమ్స్ లేకపోవడం వల్ల జీడిమెట్ల, ఫతుల్లగూడ ప్రాంతాల్లో లక్షల టన్నుల చెత్త నిల్వ ఉందని పేర్కొంది. నిర్మాణ వ్యర్థాల (సీ అండ్ డీ వేస్ట్) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన పాలసీ రూపొందించలేదని, ఉన్న ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని వెల్లడించింది. దాదాపు 50 శాతం కంటే ఎక్కువ చెత్త ఓపెన్ డంప్ యార్డుల్లోనే పడి ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.

కితాబులు.. సిఫార్సులు  

ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఉత్పత్తయ్యే మొత్తం చెత్తలో కేవలం 20 శాతం మాత్రమే ల్యాండ్​ఫిల్ కు చేరాలన్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్​గా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ నిలవడంపై కాగ్ కితాబిచ్చింది. జవహర్ నగర్ ప్లాంట్ వద్ద చెత్త సేకరణ, రవాణా, శాస్త్రీయ విభజన పద్ధతులను మరింత మెరుగుపరచాలని సూచించింది. 

చెత్తను ఉత్పత్తి కేంద్రం వద్దే వేరు చేయడం (సోర్స్ సెగ్రిగేషన్) పకడ్బందీగా అమలు చేయాలని, పెండింగ్​లో ఉన్న బకాయిలను వెంటనే వసూలు చేయాలని సిఫార్సు చేసింది. నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ తన పనితీరును యుద్ధ ప్రాతిపదికన మార్చుకోవాలని నివేదిక స్పష్టం చేసింది.