- కౌంటింగ్కు ముందే క్యాంపులకు అభ్యర్థులు
- అన్ని ప్రధాన పార్టీలదీ ఇదే తీరు
- ఈ నెల 16న మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు
- అప్పటి వరకు అభ్యర్థులను కాపాడుకునే పనిలో పార్టీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. గతంలో ఎన్నికల ఫలితాల తర్వాత క్యాంపులు మొదలయ్యేవి. కానీ ఈసారి కౌంటింగ్కు ముందే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. బుధవారం పోలింగ్ ముగిసిన వెంటనే రాత్రికి రాత్రే పలుచోట్ల నేతలు తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించారు. వీరిని శుక్రవారం జరగనున్న కౌంటింగ్కు తీసుకొచ్చి, గెలుపు ఖాయమైతే అటు నుంచి అటే తిరిగి క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ నెల 16న మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు జరుగుతాయి. దీంతో అప్పటి వరకు అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీలు ఈ క్యాంపు పాలిటిక్స్‌కు తెరతీశాయి.
పోలింగ్ ముగియగానే క్యాంపు పాలిటిక్స్
మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చాలెంజ్‌గా తీసుకున్నాయి. ఎక్కువ సంఖ్యలో మేయర్, చైర్ పర్సన్స్థానాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో సగానికి పైగా కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లు వచ్చిన పార్టీకి మేయర్, చైర్ పర్సన్‌గా ఎన్నికవుతారు. ఒకటో, రెండో ఓట్లు తగ్గితే ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారతాయి. మాజిక్ ఫిగర్ రాని చోట పీఠాలను కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు ఇండిపెండెంట్లు, ఇతరులను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తాయి. గెలుపు అవకాశాలున్న ఇండిపెండెంట్లపై ఇప్పటికే పార్టీలు ఫోకస్‌పెట్టినట్టు తెలుస్తోంది. హంగ్ పరిస్థితి వస్తే మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీ.. డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్ పర్సన్పదవుల ఆశ చూపి ఇతర పార్టీలకు గాలం వేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇలాంటి సర్దుబాట్లు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటిరెండు చోట్ల కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య రాజీ కుదిరే చాన్స్ ఉంది. అధికార పార్టీ గెలిచిన తమ క్యాండిడేట్లను తన్నుకుపోకుండా బీఆర్ఎస్, బీజేపీ జాగ్రత్త పడుతున్నాయి. ఇందులో భాగంగా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి.
క్యాంపుకు వెళ్లింది వీరే..
మంచిర్యాల కార్పొరేషన్లో బీజేపీ అభ్యర్థులను ఆ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్‌రావు బుధవారం రాత్రే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు తరలించారు. చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల బీఆర్ఎస్ అభ్యర్థులు కొండగట్టు క్యాంపులో ఉన్నారు. క్యాతనపల్లి కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం సాయం త్రం హైదరాబాద్ తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్‌కు చెందిన 28మంది అభ్యర్థులు బుధవారం రాత్రి క్యాంప్‌కు బయలుదేరి వెళ్లారు. మొదటి నుంచీ వేములవాడ బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్యెల్యే అది శ్రీనివాస్ వ్యూహ రచన చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లో వివిధ డివిజన్ల నుంచి పోటీచేసిన బీఆర్ఎస్అభ్యర్థులు గురువారం రాత్రి గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్ హాల్ నుంచి క్యాంపునకు తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కొందరిని హైదరాబాద్‌కు తరలించగా, శుక్రవారం వచ్చే ఫలితాల ఆధారంగా మరికొందరిని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
16 దాకా క్యాంపుల్లోనే..!
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలకు సంబంధించి శుక్రవారం కౌంటింగ్జరగనుంది. కౌంటింగ్ పూర్తి కాగానే అన్ని పార్టీలు గెలిచిన తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వెళ్లినవారు కూడా శుక్ర వారం కౌంటింగ్సెంటర్కు వచ్చి, తిరిగి వెళ్లే అవకాశముంది. దీంతో అభ్యర్థులం తా క్యాంపులకు వెళ్లేందుకు వీలుగా బట్టలు సర్దు కుని కౌంటింగ్ సెంటర్‌కు రావాలని సూచించా రు. గెలిచినవారు చేజారకుండా ఒక్కొక్కరికి ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. క్యాపుల నిర్వహణ బాధ్యతలను తమ పార్టీల్లోని సీనియర్లు, చురుకైన లీడర్లకు అప్పగించారు. కాంగ్రెస్‌లో అయితే స్వయంగా రాష్ట్ర మంత్రులే క్యాంపులకు ఏర్పాట్లు చేయిస్తు న్నారు. మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలకు మూడు రోజుల టైమ్ మాత్రం ఉండడంతో దాదాపు అందరూ హైదరాబాద్శివార్లలో ఉన్న రిసార్ట్లు, ఫామ్‌హౌజ్‌లకు తరలిస్తున్నారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక జరిగే 16న ఉదయం 10 గంటలకు డైరెక్టుగా మున్సిపాలిటీ దగ్గరకే వారిని తీసుకుచ్చేలా ప్లాన్ చేశారు.
