తెలంగాణ సెంట్రిక్గా టీఎస్​పీఎస్సీ సిలబస్

తెలంగాణ సెంట్రిక్గా టీఎస్​పీఎస్సీ సిలబస్

టీఎస్​పీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఏ చిన్న అంశాన్ని విస్మరించొద్దని, హార్డ్ గా ఉందని వదిలేయొద్దని, అన్నీ చదవాల్సిందేనని ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. సిలబస్ లోని చాలా అంశాలను తెలంగాణ సెంట్రిక్ గా రూపొందించామని, అలాగని తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఎకానమీ గురించి మనకంతా తెలుసనే ధోరణి అభ్యర్థులకు ఉండొద్దని, సబ్జెక్టులపై లోతైన అధ్యయనం, పూర్తి అవగాహన ఉండాలన్నారు.  

తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2‌‌015లో నియమించిన గ్రూప్ – 1 సిలబస్ కమిటీకి కన్వీనర్ గా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ఈ కమిటీలో భాగస్వాములయ్యారు. తెలంగాణ  ప్రజలకు సేవ చేయబోయే ఆఫీసర్లకు ముందు తమ ప్రాంతానికి సంబంధించిన అన్నిరంగాలపై పూర్తిగా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ  కేంద్రంగానే సిలబస్ కు రూపకల్పన చేశాం. జనరల్ స్టడీస్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీలో తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, గత చరిత్ర, తొలి, మలి దశ ఉద్యమాలు వంటి వాటిపై అభ్యర్థుల అవగాహనను టెస్ట్ చేసేలా సిలబస్‌ను రూపొందించాం. తెలంగాణ ఉద్యమ చరిత్రపైనే ప్రత్యేకంగా గ్రూప్ –1లో ఓ పేపర్ పెట్టాం. నిజాం పరిపాలన, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్రంగా హైదరాబాద్‌ ఏర్పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొలువుల కోసం సాగిన ముల్కీ ఉద్యమం,  పెద్ద మనుషుల ఒప్పందాలు, వాటి అమలులో వైఫల్యాలు, 1969 తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమాల గురించి ఈ పేపర్ లో ఉంటుంది. అలాగే వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు వంటి అంశాలపైనా ప్రశ్నలు ఇచ్చేలా పలు అంశాలను సిలబస్ లో పొందుపరిచాం. 

అంతా తెలుసనే ధోరణి వద్దు..    

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులుగా ఉన్న అభ్యర్థులకు ఉద్యమ ఘట్టాల గురించి ఓవరాల్ గా అవగాహన ఉండొచ్చు. కానీ, అకడమిక్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై లోతైన అవగాహన అవసరమవుతుంది మార్కెట్ లో తెలంగాణ ఉద్యమ చరిత్ర పై చాలా పుస్తకాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంపై అవగాహన కోసం ప్రస్తుతానికి తెలుగు అకాడమీ తీసుకొచ్చిన పుస్తకం,  వి.ప్రకాశ్ రాసిన బుక్ సిలబస్ పరిధిలో సమగ్రంగానే అనిపించాయి.   

సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన ముఖ్యమే.. 

వర్తమాన సమస్యల మీద అవగాహన పెంచుకోవాలి. దానికి తగ్గట్టుగా కొంత సైన్స్అండ్ టెక్నాలజీ అవగాహన ఉండాలి. నిత్య జీవితంలో,  పాలనలో ఈ పరిజ్ఞానం తోడ్పడుతుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అనగానే శాస్త్ర, సాంకేతిక రంగాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని ఏమీ లేదు. ఈ పేపర్ కు సంబంధించిన సిలబస్ పూర్తిగా ఇంటర్ స్థాయిలోనే ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశోధన తీరు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందనే అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. 

తెలంగాణ ఎకానమీ లోతుల్లోకి వెళ్లాలి.. 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమాన్ని నిజాం కాలం నుంచి చూడాలి. ఒకప్పుడు తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ వేళ్లూనుకుని ఉండేది. దొర, దేశ్ ముఖ్, జమీందారీల చేతుల్లో వేల ఎకరాలు ఉంటే.. ప్రజలంతా కూలీలుగా పని చేసేవారు. నిజాంకు కింది స్థాయిలో ప్రతినిధులుగా వీళ్లే వ్యవహరించేవారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా భూమి, భుక్తి, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఈ పోరాటం ఫలితంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జమీందారీ యాక్ట్ ను రద్దు చేయడం, కౌలుదారీ చట్టం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లాంటి చట్టాలను తీసుకురావడం వల్ల భూస్వామ్య వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. అనేక భయాలతో భూస్వాములు భూములు అమ్ముకోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉనికిలోకి వచ్చారు. ఒకప్పటితో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలాగే ఇండియన్ ఎకానమీని చూసినప్పుడు  1970 తర్వాత జాతీయ స్థాయిలో వచ్చిన సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, 20 సూత్రాల పథకం, భూసంస్కరణలపై అవగాహన పెంచుకోవాలి. పీవీ చేపట్టిన నూతన ఆర్థిక పారిశ్రామిక సంస్కరణల తర్వాత వచ్చిన మార్పులు ఏమిటి, కరోనాకు ముందు, తర్వాత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన కుదుపులు, మార్పులపై ప్రశ్నలు రావొచ్చు. ప్రతి పేపర్ లో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రంగాలవారీగా వచ్చిన మార్పులపై అవగాహన ఉండాలి.

సివిల్స్ కు ప్రిపేరయ్యేవాళ్లకు అడ్వాంటేజీ..

ఇప్పటికే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ కొంత ఈజీగా ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్ర మినహా భారత దేశ చరిత్ర, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ యూపీఎస్సీ సిలబస్ కు దగ్గరగా ఉండేలా రూపొందించాం. అందువల్ల సివిల్స్ కు ప్రిపేరయ్యే తెలంగాణ అభ్యర్థులకు ఇది అడ్వాంటేజీగా మారే అవకాశం ఉంది.

రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి 

స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత  రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగంలో అంశాలు బ్రిటీష్ చట్టాలు, ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్నారనే ప్రచారం ఉంది. కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎజెండా మీదికొచ్చిన ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామిక విలువలు, హక్కుల చైతన్యం, దోపిడీ, వివక్ష, ఆర్థికంగా, సామాజికంగా వివిధ వర్గాల వెనుకబాటు ఆధారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తోపాటు ఇతర రాజ్యాంగ రచన కమిటీ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ పీఠిక,  మౌలిక సూత్రాలు, స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, నాటి నేతల స్ఫూర్తిని గుర్తు చేసుకోకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. పాలకులే రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఉద్యోగంలో కొనసాగే ప్రతి అధికారికి రాజ్యాంగం,  ప్రజలకు కల్పించిన హక్కుల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలి.

ప్రొ. కోదండరాం, టీఎస్​పీఎస్సీ సిలబస్​ కమిటీ కన్వీనర్​