SRH vs RCB: హైదరాబాద్‌లో బెంగళూరు హవా: ఉప్పల్‌లో RCB చారిత్రాత్మక మ్యాచ్

SRH vs RCB: హైదరాబాద్‌లో బెంగళూరు హవా: ఉప్పల్‌లో RCB చారిత్రాత్మక మ్యాచ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నేడు (ఏప్రిల్ 25) సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు సిద్ధమవుతుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ గెలిచిన డుప్లెసిస్ సేన.. ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది. అయినప్పటికీ ఈ మ్యాచ్ వారికి చాలా ప్రత్యేకంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 250 మ్యాచ్ ఆడబోతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఈ చారిత్రక క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంది. 2008లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా మొదలు పెట్టిన ఆర్సీబీ 17 సంవత్సరాల ప్రయాణంలో రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 117 మ్యాచ్ ల్లో గెలిచి 128 ఓడింది. నాలుగు మ్యాచ్ ల్లో ఫలితాలు రాలేదు.  వీరి గెలుపు శాతం 46.18 గా ఉంది. 17 సీజన్ లు జరిగితే మూడు (2009, 2011,2016) సార్లు ఫైనల్ కు చేరింది. అయితే ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోవడం ఆ జట్టును నిరాశకు గురి చేస్తుంది. 2009 లో డెక్కన్ చార్జర్స్ పై ఆరు పరుగుల తేడాతో.. 2011లో  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై గెలవాల్సిన మ్యాచ్ లో ఎనిమిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Also Read:RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్ 

ఫైనల్స్ కాకుండా ఆర్సీబీ 2010, 2015, 2020, 2021, 2022లో ఐదు సార్లు టోర్నమెంట్‌లో ప్లే ఆఫ్ కు చేరుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 38.01 సగటుతో 7,642 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిస్తే.. 2014-21 మధ్య కాలంలో ఆర్సీబీ  ఫ్రాంచైజీ తరఫున ఆడిన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 113 మ్యాచ్‌ల్లో 139 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నేడు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నా.. బెంగళూరు జట్టుపైనే అందరి దృష్టి ఉంది. మరి వరుస పరాజయాలతో డీలాపడ్డ ఆర్సీబీ ఈ చారిత్రాత్మక  మ్యాచ్ లోనైనా గెలుస్తుందేమో చూడాలి.