NEET పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

NEET పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన NEET పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న మనీషా సంజయ్ హవాల్దార్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక నిందితురాలైన మనీషా సంజయ్ హవల్దార్‌ను సీబీఐ సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్టు చేయడం గమనార్హం. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సేథ్ హిరాలాల్ సరఫ్ ప్రశాలలో మనీషా ప్రస్తుతం లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది.

NEET యూజీ 2026 పరీక్షా ప్రక్రియలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మనీషాను ఎక్స్పర్ట్గా నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ చెబుతున్న ప్రకారం.. ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నాపత్రాలపై పూర్తి అవగాహన ఉంది. ఏప్రిల్ 2026లో.. ఆమె నీట్ పరీక్షకు సంబంధించిన ఫిజిక్స్ ప్రశ్నలను, మే 16న అరెస్ట్ అయిన మనీషా మంధారేకు షేర్ చేసినట్లు సీబీఐ తెలిపింది.

పరీక్షకు 45 గంటల ముందే ప్రశ్నపత్రం లీకైనట్లు సీబీఐ నిర్ధారించింది. మహారాష్ట్రలోని నాసిక్‌‌కు చెందిన మెడికల్ విద్యార్థి శుభమ్ ఖైర్నార్(30 ) ..పేపర్ లీకేజీలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. శుభమ్ ఒక ముఠా నుంచి రూ. 10 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి, దాన్ని హర్యానాకు చెందిన మరో వ్యక్తికి రూ. 15 లక్షలకు విక్రయించినట్లు సీబీఐ గుర్తించింది.

పరీక్షకు రెండు రోజుల ముందు కేరళలో చదువుకుంటున్న ఓ విద్యార్థి..రాజస్తాన్‌‌లోని సికార్‌‌లో హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి ‘గెస్ పేపర్’ పేరుతో ఒక పీడీఎఫ్ పంపాడు. ఆయన పీడీఎఫ్ పేపర్‌‌ను తన హాస్టల్‌‌లోని నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లకు ఇవ్వాలని భావించినప్పటికీ, వారు అప్పటికే పరీక్షా కేంద్రాలకు వెళ్లిపోయారు. పరీక్ష ముగిసి తిరిగి వచ్చిన విద్యార్థులు పీడీఎఫ్ పేపర్‌‌ను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కు చూపించారు.

వారు కెమిస్ట్రీలో 108 ప్రశ్నలకు గానూ 45, బయాలజీలో 204 ప్రశ్నలకు గానూ 90 ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు గుర్తించి పేపర్ లీకేజీ అయినట్లు అనుమానించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.  విచారణ అనంతరం పేపర్ లీకేజీని నిర్ధారించిన ఎన్టీఏ.. కేంద్ర విద్యాశాఖతో చర్చించి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షను మంగళవారం రద్దు చేసింది.