మనీష్ సిసోడియాకు మళ్లీ సీబీఐ నోటీసులు 

మనీష్ సిసోడియాకు మళ్లీ సీబీఐ నోటీసులు 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ బడ్జెట్ రూపకల్పన సందర్భంగా తాను సీబీఐ విచారణకు హాజరుకాలేనని, ఫిబ్రవరి చివరలో విచారణకు సహకరిస్తానని నిన్న తెలిపారు. సిసోడియా విజ్ఞప్తి మేరకు ఈనెల 26న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. 

అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను విచారణకు హాజరు కాలేనని మనీశ్ సిసోడియా సీబీఐకి చెప్పారు. తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. బడ్జెట్‌ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా తన కర్తవ్యమని, ఇది ఢిల్లీకి ముఖ్యమైన సమయమని చెప్పారు. దీని కోసం తాను 24 గంటలు పని చేస్తున్నాన్న మనీశ్ సిసోడియా.. తానేమీ పారిపోవాలని గడువు అడగడం లేదని వివరించారు. విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని.. ఇప్పుడు మాత్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరారు.

లిక్కర్ స్కాంలో సిసోడియా పేరున్నట్టు సీబీఐ వెల్లడించింది. విచారణకు హాజరు కావాలంటూ మరోసారి పిలుపొచ్చిందని ఆయన ఇటీవల ట్వీట్ ద్వారా తెలియజేశారు. గతంలో ఆ సంస్థలు తన ఇల్లు, బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేసినా తనకు వ్యతిరేకంగా వారికి ఏమీ దొరకలేదని గుర్తు చేశారు.