పండుగలా పాత పంటల జాతర

పండుగలా పాత పంటల జాతర
  • ఎడ్ల బండ్లపై ఊరూరా తిరుగుతూ అవగాహన
  • విత్తనశుద్ధి నుంచి మార్కెటింగ్ వరకు మెళకువలు
  • ఆరోగ్యకరమైన పంటలు వేయాలని సూచనలు 
  • డీడీఎస్ సహకారంతో పస్తాపూర్ మహిళా రైతుల ప్రచారం

సంగారెడ్డి, వెలుగు: పాత పంటల జాతర పండుగలా జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా మొదలై చుట్టుపక్కల గ్రామాల్లో కొనసాగుతోంది. జిల్లాలోని పస్తాపూర్​కు చెందిన వెయ్యి మంది మహిళా రైతులు ‘అందరికీ పౌష్టికాహారం’ అనే నినాదంతో ఎడ్ల బండ్లపై రోజుకో ఊరు తిరుగుతూ చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం, వాటి అవసరం గురించి వివరిస్తున్నారు. డీడీఎస్(డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ) సహకారంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏటా సంక్రాంతికి మొదలయ్యే జాతర కరోనా థర్డ్​వేవ్​కారణంగా ఈసారి లేట్ అయ్యింది. ఈ నెల1వ తేదీన మొదలైన 22వ పాత పంటల జాతర నేటితో ముగియనుంది. 

చిన్న కుండల్లో చిరు ధాన్యాలు

15 రోజులపాటు జరిగే జాతరలో భాగంగా రైతులు ఎడ్ల బండ్లను అందంగా అలంకరిస్తారు. డప్పు చప్పుళ్లు, గ్రామీణ నృత్యాలు, పాటలు, కోలాటాలతో అవగాహన కల్పిస్తారు. చిన్న కుండల్లో చిరుధాన్యాలు ఉంచి ఊళ్లలో ప్రదర్శిస్తారు. పాత పంటలు పండిస్తున్న తీరును వీడియోల రూపంలో జనానికి చూపిస్తారు. దాదాపు 80 రకాల చిరుధాన్యాలు, సాగులో లేని ఆకుకూరలను పరిచయం చేస్తారు. గ్రామాల్లోకి వచ్చిన ఎడ్ల బండ్లకు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. చిరుధాన్యాల కుండలకు పూజలు చేస్తారు. 

హెల్త్​కు ఎంతో మంచిది

కాలానుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం అంతా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో చిరుధాన్యాలతో హెల్త్​ఇష్యూస్​కు చెక్​ పెట్టొచ్చని డీడీఎస్ చెబుతోంది. అందులో భాగంగా ఏటా మహిళా రైతులతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తోంది. జీవ వైవిధ్యమే దేవాలయంగా.. విత్తనాలే దేవుళ్లుగా భావిస్తూ రైతులు చైతన్య పరుస్తున్నారు. రాగులు, కొర్రలు, అవిసలు, జొన్నలు, సామలు, సజ్జలు వంటి చిరుధాన్యాలతోపాటు సాగులో లేని ఆకుకూరలు, మరుగున పడిపోయిన పాత పంటలను పరిచయం చేస్తున్నారు. కేవలం పంటల గురించే కాకుండా సాగు చేసే విధానం, మెళకువలు నేర్పిస్తున్నారు. తెల్లగవ్వల కూర, ఉత్తరేణి, జొన్నచేంచేలి, పొనగంటి కూర, తలేల్ల ఆకుకూర, ఎలక చెవినకూర, సన్న పాయలకూరల్లో అనేక పోషకాలు ఉంటాయని, కానీ కాలానుగుణంగా ఇవి సాగులో లేకుండా పోయాయని చెబుతున్నారు. పస్తాపూర్, చుట్టుపక్కల రైతులు డీడీఎస్​సహకారంతో కరోనా టైంలో 21 దేశాలకు ఆహార ధాన్యాలు అందించారు. 

నేడు ముగింపు వేడుకలు

పాత పంటల జాతర జిల్లాలోని ఝరాసంగం మండలం మాచ్​నూరులో మంగళవారం మహా జాతరతో ముగించనున్నారు.15 రోజుల పాటు వివిధ గ్రామాల్లో పర్యటించి చిరుధాన్యాల గురించి అవగాహన కల్పించిన మహిళా రైతులను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు డీడీఎస్ ప్రతినిధులు గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు వివిధ దేశాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రానున్నారు. మాచ్ నూరు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

80 రకాల విత్తనాల తయారీ

చదువురాని వేల మంది మహిళా రైతులు దాదాపు 80 రకాల విత్తనాలను సొంతంగా తయారుచేస్తున్నారు. ఆవుపేడ వంటి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. పాత కాలంలో వాడిన ఎరువులను ఆర్గానిక్ రూపంలో పరిచయం చేస్తున్నారు. అయితే వీటికి ఉదయం పూట కురిసే మంచు, వాతావరణ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. తయారు చేసిన సేంద్రియ విత్తనాలను మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా భద్రపరచి వాటిని విత్తనాల బ్యాంకులుగా పిలుస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆ శాసనం చుట్టే మేడారం యుద్ధ చరిత

కొవిడ్‌‌ మనల్ని విడిచి ఎప్పటికీ పోకపోవచ్చు

చిలుకలగుట్టపై ఏం పూజలు చేస్తమో చెప్పం