కొవిడ్‌‌ మనల్ని విడిచి ఎప్పటికీ పోకపోవచ్చు

కొవిడ్‌‌ మనల్ని విడిచి ఎప్పటికీ పోకపోవచ్చు
  • ఒమిక్రానే చివరిది కాదు.. కొత్త వేరియంట్​లు వస్తూనే ఉంటయ్ 
  • టీకాలే వెపన్స్.. మాస్కులు, ఫిజికల్​ డిస్టెన్స్ తప్పనిసరి 
  • కరోనాపై పోరును నిర్లక్ష్యం చేయొద్దు    అమెరికన్ సైంటిస్టుల హెచ్చరిక

వాషింగ్టన్: కరోనా మహమ్మారి మోపై ఇప్పటికే మూడేండ్లు అయితున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రస్తుతం థర్డ్ వేవ్.. మరికొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అయితే, కొత్త వేవ్ లు వస్తూనే ఉంటాయని, కరోనా మనల్ని విడిచి ఎప్పటికీ పోకపోవచ్చని అమెరికాలోని పలు సంస్థలకు చెందిన సైంటిస్టులు చెప్తున్నారు. ఒమిక్రాన్ వేరియంటే చివరిది కాకపోవచ్చని, మరిన్ని కొత్త వేరియంట్లు పుడుతూ.. కొత్త వేవ్ లు వస్తూనే ఉంటాయని వారు అంటున్నారు. కరోనా తగ్గుముఖం పట్టినందున విపత్తు ముగిసినట్లేనని అనుకోరాదని, వైరస్ పై పోరాటాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.  

డెల్టా వంటివి మళ్లీ పుట్టొచ్చు..

కరోనా తగ్గుతోందని చాలా దేశాలు ఆంక్షలు సడలిస్తున్నయి. కానీ ప్రపంచమంతటా వైరస్ అంతమయ్యే వరకూ ముప్పు తొలగిపోయినట్లు అనుకోరాదని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నరు. ముఖ్యంగా సంపన్న దేశాలు వ్యాక్సిన్ సప్లై చైన్ కు ఆటంకం కలిగిస్తుండటం వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని, దీనివల్ల ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగవచ్చని హెచ్చరిస్తున్నరు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అది కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యాపించిందని సైంటిస్టులు గుర్తు చేస్తున్నరు. మున్ముందు డెల్టా వంటి డేంజరస్ వేరియంట్లు మళ్లీ పుట్టే అవకాశం ఉందని, అవి తీవ్రంగా వ్యాపిస్తే.. కరోనా సోకిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. 

ప్రతి కొన్ని నెలలకోసారి వ్యాప్తి తీవ్రం

‘‘ప్రతి కొన్నినెలలకు ఓసారి వైరస్ వ్యాప్తి తీవ్రం అవుతోంది. బూస్టర్ డోస్ టీకాలతో డెల్టాకు అడ్డుకట్ట వేశామని సంతోషిస్తున్న సమయంలో ఒమిక్రాన్ వచ్చి మళ్లీ విలయం సృష్టించిన విషయాన్ని మరిచిపోరాదు. మనం కంటిన్యూగా వైరస్ బారిన పడుతూనే ఉంటామనేందుకు ఇది ఒక ఎగ్జాంపుల్” అని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ అకికో ఇవాసకీ చెప్పారు. ‘‘ప్రపంచమంతా వ్యాక్సిన్ లు, యాంటీ వైరల్ మెడిసిన్స్, టెస్టింగ్ కిట్ల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వైరస్ ను నివారించడం చాలా ఈజీ అయింది. అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిందని ఇప్పుడే అనుకోరాదు” అని ఆమె స్పష్టం చేశారు.

మ్యుటేషన్ లు కొనసాగుతయ్

కరోనా వైరస్ లో మ్యుటేషన్ లు కొనసాగుతూనే ఉంటాయని, కేసులు భారీగా పెరిగితే ప్రతి ఒక్కరూ డేంజర్ లో పడతారని సైంటిస్టులు అంటున్నారు. అమెరికాలో వాస్తవానికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భారీగా ఉన్నప్పటికీ, రిపోర్ట్ అవుతున్న కేసుల సంఖ్య 20 నుంచి 25% లోపే ఉందని సియాటెల్ లోని ఫ్రెడ్ హచిన్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ట్రెవర్ బెడ్ ఫోర్డ్ వెల్లడించారు. జనవరి మధ్యలో డైలీ కేసులు గరిష్టంగా 8 లక్షలు నమోదైనప్పటికీ, వాస్తవంగా రోజూ 30 లక్షల మందికి వైరస్ వ్యాపించి ఉండొచ్చని అంచనా వేశారు. యూరప్​లోనూ ఒమిక్రాన్ అధికారిక లెక్కల కంటే ఎక్కువే వ్యాపించి ఉంటుందని డబ్ల్యూహెచ్ వో నిపుణుడు హాన్స్ క్లూగ్ చెప్పారు. 

‘బూస్టర్’లతోనే వైరస్ కంట్రోల్ 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 62% మంది ప్రజలకు కనీసం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అందింది. మొత్తం ప్రపంచ జనాభాలో కనీసం 75% మందికి ఫస్ట్ డోస్ కంప్లీట్ చేయడానికే మరో 5 నెలలు పడ్తది. కానీ 2 డోసులు మాత్రమే వేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని సైంటిస్టులు చెప్తున్నారు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయి, ఇమ్యూన్ రెస్పాన్స్ బాగా ఉండాలంటే బూస్టర్ డోస్ టీకాలే మార్గమని, వీటితోనే వైరస్​ను కట్టడి చేసే చాన్స్ ఉందని అంటున్నారు. చైనా తయారు చేసిన సినోవాక్ వంటి ఇన్ యాక్టివేటెడ్ టీకాలైతే కనీసం 2 బూస్టర్ డోస్​లు అవసరమని అకికో ఇవాసకీ అభిప్రాయపడ్డారు.

అలర్ట్ గా ఉండాల్సిందే  

‘‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నా, వేరియంట్లు పుట్టి, ఇతర ప్రాంతాలకు వ్యాపించే చాన్స్ ఉంటుంది. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలి” అని సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ సీఈవో గ్లెండా గ్రే అన్నా రు. ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని బట్టి లాక్ డౌన్​లు, ట్రావెల్ ఆంక్షలు మళ్లీ మళ్లీ విధించక తప్పకపోవచ్చని యూఎస్ ఎఫ్​డీఏ మాజీ డైరెక్టర్ మెక్ క్లెలాన్ చెప్పారు. కరోనా రూల్స్ మళ్లీ పాటించక తప్పదన్నారు.

మరిన్ని వార్తల కోసం..

చిలుకలగుట్టపై ఏం పూజలు చేస్తమో చెప్పం

సారలమ్మను తెచ్చేటప్పుడు  ఏదీ యాదుండది

కోట్లు వస్తాయనుకుంటే.. పైసా  ఇయ్యలే