- కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారు
- స్థానిక, జిల్లాల నుంచి వచ్చిన నేతల మధ్య సమన్వయమూ కారణమే
- కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ ఎదుర్కోవడం కష్టమైంది
- స్థానిక బీఆర్ఎస్ నేతలెవరూ ఎలక్షన్ ను పట్టించుకోలే
- ఓటమిపై కార్యకర్తల అభిప్రాయాలు
- సేకరించిన మాజీ మంత్రి కేటీఆర్
- తండ్రి చనిపోయినా హరీశ్ గెలుపుకోసం యత్నించారన్న కేటీఆర్
- జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుదామన్న హరీశ్ రావు
హైదరాబాద్: సొంత పార్టీలోని కొందరి తీరు వల్లే జూబ్లీహిల్స్ లో ఓటమి పాలయ్యామని, కొందరు కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొందరు కార్యకర్తలు చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ ఓటమిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్ట తెలిసింది.
స్థానిక నేతలు, జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఓటమికి కారణమని చెప్పినట్టు సమాచారం. స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేతలు బైపోల్స్ ను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ ను ఎదుర్కోలేకపోవటం కూడా ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో కుట్ర పూరితంగా దొంగ ఓట్లు రాయించి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. తండ్రి చనిపోయినా కూడా హరీశ్ రావు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పార్టీ కోసం పనిచేశారని ప్రశంసలు కురిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని అన్నారు. బూత్ ల వారీగా పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారో రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసన్నారు. జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికలకు సిద్దంగా ఉందామని పిలుపునిచ్చారు. అందరమూ కలిసి కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. సమావేశంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
