సాధారణంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. కానీ సౌతాఫ్రికాతో టీమిండియా ఆడబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో టైమింగ్స్ మారనున్నాయి. గౌహతిలో వాతావరణ పరిస్థుల కారణంగా త్వరగా చీకటి పడడమే ఇందుకు కారణం. వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. ఈ టెస్ట్ గెలిచి ఇండియా సిరీస్ సమం చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తొలి టెస్ట్ ఇచ్చిన ఊపుతో రెండో టెస్టులోనూ ఇండియాకు షాక్ ఇవ్వాలని సౌతాఫ్రికా వ్యూహాలను రచిస్తోంది.
ఇండియా, సౌతాఫ్రికా టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ ఉదయం 9:00 గంటలకే ప్రారంభం కానుంది. 8:30 గంటలకు టాస్ వేస్తారు. 11:00 గంటల వరకు తొలి సెషన్ ఉంటుంది. లంచ్ బ్రేక్ కాకుండా 20 నిమిషాల పాటు టీ బ్రేక్ ఉంటుంది. తిరిగి 11:20 గంటలకు రెండో సెషన్ ప్రారంభమవుతుంది. 11:20 నుంచి 1:20 వరకు ఈ సెషన్ ఉంటుంది. రెండు సెషన్ ల తర్వాత 40 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2:00 నుంచి 4:00 వరకు చివరి సెషన్ జరుగుతుంది.
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు.
టెస్ట్ ఛాంపియన్ షిప్ లో నాలుగో స్థానానికి ఇండియా:
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లో భాగంగా లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత మూడో స్థానంలో ఉన్న టీమిండియా (54.17) ఒక స్థానం దిగజారి నాలుగో ర్యాంక్ తో సరిపెట్టుకుంది. మరోవైపు సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకింది. తొలి టెస్టుకు ముందు నాలుగో స్థానంలో ఉన్న సఫారీలు టీమిండియాపై విజయంతో 66.67 పాయింట్ల శాతంతో టాప్-2కు దూసుకెళ్లారు. ఒకవేళ ఇండియా చివరి టెస్టులో కూడా ఓడిపోతే పాకిస్థాన్ కంటే కిందకు వచ్చి ఐదో ర్యాంక్ లో ఉంటుంది.
