సారలమ్మను తెచ్చేటప్పుడు  ఏదీ యాదుండది

సారలమ్మను తెచ్చేటప్పుడు  ఏదీ యాదుండది
  • గద్దెమీద కూసోవెట్టినంకనే తెలివొస్తది..  
  • 2004 నుంచి అమ్మను తీసుకువస్తన్నా
  •  జాతర అయిపోయినంక ఎవుసం చేసుకుంటా
  •  ప్రతి బుధవారం  గుడి తెరిచి దీపం ముట్టిస్త 
  • సారలమ్మ ప్రధాన పూజారి  కాకా సారయ్య


ప్ర: సారలమ్మను ఎప్పటి నుంచి గద్దెలపైకి తెస్తున్నరు? 
జ:  కన్నెపల్లి నుంచి సారలమ్మను 2004 మహా జాతర నుంచి తీసుకొస్తున్న. ఈసారితో కలిపి  పదోసారి. 
ప్ర: అమ్మను తీసుకువచ్చేటప్పుడు మీకు అన్నీ గుర్తుంటాయా?.
జ: అమ్మను ఎత్తుకున్న (పూనకం వచ్చిన) క్షణం నుంచి గద్దెపైన ప్రతిష్ఠించేంతవరకు నాకు ఏదీ యాదికుండది. 
ప్ర: సారలమ్మను ఎట్లా తీసుకొస్తరు?
జ: అమ్మను ఎత్తుకుని జంపన్న వాగు నుంచి ముందు సమ్మక్క గద్దె మీదకు...అక్కడి నుంచి సారలమ్మ గద్దెపైకి పోతం. అమ్మను గద్దెపైన ప్రతిష్ఠించినంకనే నాకు తెలివస్తది.
ప్ర: మామూలు రోజుల్లో ఏ పని చేస్తరు?
జ: జాతర ముగిసినంక  ఇంటోల్లతో కలిసి ఎవుసం చేసుకుంటా. ప్రతి బుధవారం కన్నెపల్లి గుడిల దీపం ముట్టిచ్చి పూజలు చేస్త.
ప్ర: మామూలు రోజుల్లో కన్నెపల్లికి భక్తులు వస్తారా?
జ: జాతరప్పుడే కాకుండా ఉత్త రోజుల్లో మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వస్తుంటరు.  వచ్చిన వారికి గుడి తలుపులు తీసి దగ్గరుండి దర్శనం చేయిస్తా.
ప్ర : సారలమ్మ పూజారులు ఎంతమంది?
జ: ఆరుగురున్నరు. నాతో పాటు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్, కాక కనకలక్ష్మి, కాక భుజంగరావు, కాక లక్ష్మి పూజలు చేస్తరు.