భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి, అమెరికా ప్రభుత్వం $93 మిలియన్ల (సుమారు రూ. 770 కోట్లు) ఆయుధాల అమ్మకానికి ఆమోదం తెలిపింది. ఈ ఆయుధాలు మన దేశ రక్షణను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ ముప్పులను అరికట్టడానికి ఉపయోగపడతాయని అమెరికా పేర్కొంది.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌కు అందే ఆయుధాలు : $45.7 మిలియన్ల అంచనాతో జావెలిన్ క్షిపణి వ్యవస్థ (Javelin Missile System) ఇది యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే యాంటీ-ట్యాంక్ క్షిపణి, $47.1 మిలియన్లతో ఎక్స్‌కాలిబర్ ప్రక్షేపకాలు (Excalibur Projectiles) ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించే ఫిరంగి గుండ్లు ఉన్నాయి.
జావెలిన్ క్షిపణి అంటే ఏమిటి: FGM-148 జావెలిన్ అనేది ఒక మనిషి సులభంగా మోయగలిగే, యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణి. సాయుధ వాహనాలు (ట్యాంకులు), బంకర్లు, బలమైన స్థావరాలను అధిక ఖచ్చితత్వంతో నాశనం చేస్తుంది. ఇది ‘ఫైర్-అండ్-ఫర్‌గాడ్’ (Fire-and-Forget) రకానికి చెందినది. అంటే, ఆపరేటర్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత దానిని మళ్లీ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. క్షిపణిలోని ఇన్‌ఫ్రారెడ్ సీకర్ ఆటోమేటిక్‌గా లక్ష్యం వైపు దూసుకుపోతుంది. దీంతో ఆపరేటర్ ప్రయోగించిన వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవచ్చు. భారత్ కొనుగోలు చేసే ప్యాకేజీలో 100 FGM-148 జావెలిన్ రౌండ్లు, ఒక జావెలిన్ FGM-148 క్షిపణి, 25 లైట్‌వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్లు (LwCLU) ఉన్నాయి.
ఎక్స్‌కాలిబర్ ప్రక్షేపకాలు: M982A1 ఎక్స్‌కాలిబర్ వ్యూహాత్మక ప్రక్షేపకాలు. ఈ ఫిరంగి గుండ్లు (Projectiles) చాలా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు. భారత్ 216 ఎక్స్‌కాలిబర్ ప్రక్షేపకాలను కొనుగోలు చేస్తోంది.
అమెరికా విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం, ఈ ఆయుధాల అమ్మకం అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో భారతదేశ భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ సంవత్సరంలో భారత సైన్యం వాయు రక్షణను బలోపేతం చేయడానికి UKకి చెందిన థేల్స్‌తో లైట్ వెయిట్ మాడ్యులర్ క్షిపణి (LMM) వ్యవస్థను కొనేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇది తేలికగా, సులభంగా మోయగలిగే క్షిపణి వ్యవస్థ. ఎత్తైన ప్రాంతాలతో సహా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. లేజర్ బీమ్-రైడింగ్ మార్గదర్శక పద్ధతిని ఉపయోగించి చాలా ఖచ్చితమైన దాడులు చేస్తుంది. 6 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న విమానాలు, హెలికాప్టర్లు, UAVలు (డ్రోన్‌లు) వంటి వాటిని అన్ని వాతావరణాలలో టార్గెట్ చేసుకోగలదు. ట్రిపుల్-ఎఫెక్ట్ వార్‌హెడ్ & ప్రాక్సిమిటీ ఫ్యూజ్ ఇందులో ఉంటాయి.
