కేసీఆర్​ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు

కేసీఆర్​ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు

నల్గొండ, వెలుగు: 267.32 కోట్ల రూపాయలు.. హుజూర్​నగర్, నాగార్జున సాగర్ బైపోల్స్ టైంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన వరాల లెక్క ఇది. స్పెషల్ డెవలప్‌‌మెంట్ ఫండ్స్(ఎస్‌‌డీఎఫ్) కింద అందజేస్తామని అప్పట్లో చెప్పారు. సారు చెప్పినట్లు నిజంగానే కోట్లు వస్తాయని, తమ గ్రామాలు, పట్టణాలు డెవలప్ అవుతాయని స్థానిక ప్రజలు భావించారు. కానీ ఇప్పటి దాకా నయా పైసా రాలేదు. ఎక్కడా ఒక్కటంటే ఒక్క పని కూడా స్టార్ట్ కాలేదు. ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలేదు. ముందుగా పనుల ప్రపోజల్స్ పంపిస్తే సర్కారు వెరిఫై చేసి శాంక్షన్ ఇస్తుందని, పనులు చేశాక బిల్లులు పెడ్తే ఫండ్స్ రిలీజ్​చేస్తుందని ఆఫీసర్లు చెప్పారు. కేవలం వర్క్స్ ప్రపోజల్స్ పంపడానికే ఆఫీసర్లకు రెండేళ్లు పట్టింది. తీరా ప్రపోజల్స్​ఓకే అయ్యాక పనులు ఎవ్వరు చేయాలనే సమస్య వచ్చింది. పనులు తామే చేస్తామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ నెలకొంది. దీంతో ఎక్కడా వర్క్స్​షురూ కాలేదు.

ఎన్నికల టైంలో హామీల వాన

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ ఉప ఎన్నిక 2019లో.. నాగార్జునసాగర్ బైపోల్ గతేడాది ఏప్రిల్‌‌‌‌లో జరిగాయి. ఈ రెండు ఎన్నికల సందర్భంగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలకు కలిపి రూ.267.32 కోట్లు శాంక్షన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హుజూర్​నగర్ నియోజకవర్గంలోని గ్రామాలకు, నేరేడుచర్ల, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ మున్సిపాలిటీకి కలిపి రూ.68.32 కోట్లు ఎసీడీఎఫ్ ఫండ్స్ శాంక్షన్ చేశారు. అదే నాగార్జునసాగర్ ఎన్నికల టైంలో నల్గొండ జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.21 కోట్లు, గ్రామాలకు, మండల కేంద్రాలకు కలిపి రూ.178 కోట్లు శాంక్షన్ చేశారు. గ్రామానికి రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున ఫండ్స్ మంజూరు చేస్తున్నట్లు జీవోలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడా పనులు మాత్రం జరగలేదు. అదేమంటే ప్రపోజల్స్ ప్రభుత్వం వద్దనే పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. మరోవైపు వర్క్స్ శాంక్షన్ అయిన నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల వల్ల పనులు స్టార్ట్ కాలేదు.

పనుల ప్రపోజల్స్‌‌‌‌కే రెండేండ్లు

సీఎం హామీ ఇచ్చాక ఫండ్స్ వెంటనే వస్తాయని, పనులు చకచకా జరిగిపోతాయని అందరూ భావించారు. కానీ హుజూర్​నగర్ నియోజకవర్గంలో 2019లో ఎలక్షన్స్​ జరిగితే పనుల ఆర్డర్స్ 2021 డిసెంబర్​లో వచ్చాయి. అంటే ఈ వర్క్స్ ప్రపోజల్స్ పంపడానికే ఆఫీసర్లకు రెండేళ్ల టైం పట్టింది. అధికారులు ఇష్టమొచ్చినట్లు చేయడంతో సమస్యలు వచ్చాయి. హుజూర్​నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులన్నీ మున్సిపాలిటీ ఆమోదం లేకుండా డైరెక్ట్ నల్గొండ జిల్లా పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ డిపార్ట్‌‌‌‌మెంట్లకు అప్పగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అపొజిషన్ పార్టీ కౌన్సిలర్లు కోర్టులో కేసు వేయడంతో పనులు పెండింగ్‌‌‌‌లో పడ్డాయి. ఇదే పరిస్థితి గ్రామాల్లో రిపీట్ కాకుండా ఇప్పుడిప్పుడే సర్పంచులతో తీర్మానాలు చేయిస్తున్నారు. 

ఎమ్మెల్యేల సిఫార్సు తప్పనిసరి

ఎస్‌‌‌‌డీఎఫ్ ప్రపోజల్స్ ఎమ్మెల్యేల నుంచే రావాలని సర్కారు రూల్ పెట్టింది. సర్కారు నుంచి వర్క్స్ శాంక్షన్ అయి వచ్చాక మళ్లీ ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు పనులు ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఎమ్మెల్యేల అనుచరులకు, రూలింగ్ పార్టీ లీడర్లకు వర్క్స్ ఇయ్యడాన్ని ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు మధ్య లొల్లి నడుస్తోంది. గ్రామానికి కేటాయించిన రూ.20 లక్షల పనులను తామే చేస్తామని, ఇంకొకరికి ఇచ్చేది లేదని సర్పంచులు తెగేసి చెబుతున్నారు. దీంతో నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, కనగల్ మండలాలు, నాగార్జునసాగర్, దేవరకొండ మున్సిపాలిటీ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వర్క్స్ ఇంకా శాంక్షన్ కాలేదు. వర్క్స్ శాంక్షన్ అయిన నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు మధ్య పనుల పంపకాల పంచాయితీ నడుస్తోంది. ఇక రూలింగ్ పార్టీకి ఎమ్మెల్యే లేని మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రపోజల్స్ కూడా ప్రిపేర్ చేయలేదు. జిల్లా మంత్రి జగదీశ్‌‌‌‌​రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపేందుకే ఆఫీసర్లు భయపడుతున్నారు.