భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం: అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి ఓ ఇంట్లోకి వరద నీరు చేరిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం (మార్చి 8) అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం తోగ్గూడెంలోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ పాల్వంచ బసవతారక కాలనీ మీదుగా వెళుతోంది. పాక్షికంగా ఈ పైపు లైన్ పగలగా సమీపంలోని రైతు హున్నాలాల్ టమాటా తోట నీట మునిగింది. 

పైపులైన్‎ను పరిశీలించిన అధికారులు మరమ్మతు చేయిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగానే ఆదివారం (మార్చి 8) అర్ధరాత్రి మరోచోట పైప్ పగిలింది. దీంతో 450 హెచ్పీ మోటార్ల ద్వారా వచ్చే ఫోర్స్ ఒక్కసారిగా ఫ్లో కావడంతో వరద నీరంతా సమీపంలోని తేజావత్ మోహన్ బాబు ఇంటిపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఇంటి అద్దాలు, గేట్, ఫ్యాన్లు ధ్వంసం అయ్యాయి. 

కిటికీ అద్దాలు పగిలి ఇంట్లోకి వరద చిమ్మడంతో ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, టీవీ తడిసి ముద్దయ్యాయి. మొత్తం రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించగా రాత్రి పైపులైన్ నీరు సరఫరా అయ్యే గేట్ వాల్ మూసేశారు. డీఈ తెల్లవారుజామున మోహన్ బాబు ఇంటిని పరిశీలించారు. ధ్వంసమైన సామగ్రిని మరమ్మతు చేయిస్తా మని డీఈ హామీ ఇచ్చారు.