న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అనంతరం 2026, మార్చి 16కు విచారణను వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా 23 మందికి రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం (మార్చి 9) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ట్రయల్ తీర్పు ఉందని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో స్పెషల్ కోర్టు పొరబడిందని తెలిపారు.
మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను చూడకుండా, విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ఆరోపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. సీబీఐపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది.
ఈ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఈడీ కేసులో విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అలాగే.. కేజ్రీవాల్, కవిత సహా 23 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అనంతరం 2026, మార్చి 16కు విచారణను వాయిదా వేసింది.
