BRS పార్టీకి రాజీనామా చేయలే.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా అంతే: ఎమ్మెల్యే సంజయ్

BRS పార్టీకి రాజీనామా చేయలే.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా అంతే: ఎమ్మెల్యే సంజయ్

హైదరాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని అన్నారు. పార్టీ మారినట్లు తప్పుడు ప్రచారం చేసి తన పదవి ఊడగొడదామని చూస్తున్నారన్నారు. బుధవారం (నవంబర్ 19) నియోజకవర్గ పరిధిలోని బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా బిడ్డ పెళ్లి అయిపోయిందని.. ఇప్పుడు మీ కోసం పని చేసే బాధ్యత నాదన్నారు. నేను ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అంతేనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తనను బీఆర్ఎస్‎కు రాజీనామా చేయమని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోమని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు వస్తాయన్నారు. 

కానీ తాను పార్టీ మారానని తప్పుడు ప్రచారం చేస్తూ తన పదవి ఊడగొడదామని చూస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్‎తో కలిసి రోళ్లవాగుకు నిధులు తెచ్చినప్పుడు కూడా ఇలాగే పార్టీ మారుతానని ప్రచారం చేశారని మండిపడ్డారు. నన్ను విమర్శించేవాళ్లకు నేను సమాధానం చెప్పనని.. నేను చేసిన అబివృద్ధే వాళ్లకు సమాధానం చెప్తుందన్నారు.