ఫీజుల లెక్కల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ తిరకాసు..ప్రభుత్వానికి తప్పుడు లెక్కల సమర్పణ

ఫీజుల లెక్కల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ తిరకాసు..ప్రభుత్వానికి తప్పుడు లెక్కల సమర్పణ
  • రాష్ట్ర వ్యాప్తంగా ట్రీట్మెంట్​ ఫీజు డిటైల్స్​ సేకరిస్తున్న సర్కార్​
  • కొన్ని జిల్లాల నుంచి అరకొర సమాచారమే..

యాదాద్రి/జనగామ, వెలుగు:  ప్రైవేట్​ హాస్పిటల్స్​పై సర్కారు దృష్టి సారించింది. ఏ ట్రీట్​మెంట్​కు ఎంతెంత ఫీజు వసూలు చేస్తున్నారో ఆరా తీస్తోంది. ఈ మేరకు డీఎంహెచ్​వోలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉలిక్కిపడిన ప్రైవేట్​ హాస్పిటల్స్ తాము వసూలు చేస్తున్న ఫీజుల డిటైల్స్​ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి. ఇందుకు వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కొందరు సహకరిస్తున్నారని తెలుస్తోంది. చిన్న అనారోగ్యంతో హాస్పిటల్​కు వెళ్తే చాలు డాక్టర్లు నానా హడావుడి చేసి పేషెంట్లను భయపెట్టేస్తున్నారు.

రకరకాల టెస్టులు చేయించుకోవాలని సిఫారసు చేస్తూ అవసరమున్నా లేకున్నా ఇన్​ పేషెంట్​గా చేర్చుకుంటూ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు హాస్పిటల్స్​లో డిస్​ప్లే చేయాలని గతంలోనే వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ప్రైవేట్​ హాస్పిటల్స్​ ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. జిల్లాల్లోని డీఎంహెచ్​వోలకు మహా అయితే హాస్పిటల్​ రిజిస్ట్రేషన్​ రద్దు చేయడం తప్ప వాటిపై చర్య తీసుకోవడానికి అధికారాలు లేవు. ఒకవేళ రిజిస్ట్రేషన్​ రద్దు చేసినా మరో పేరుతో కొత్త హాస్పిటల్​ రిజిస్ట్రేషన్​ చేయించుకుంటారు. యాదాద్రి జిల్లాలో అక్రమ అబార్షన్ల కేసులో గతంలో హాస్పిటల్​ రిజిస్ట్రేషన్​ రద్దు చేశారు. ఆ తర్వాత మరో పేరుతో రిజిస్ట్రేషన్​ చేయించుకొని మళ్లీ అబార్షన్ల కేసులో చిక్కుకున్న హాస్పిటల్​ ఉదంతమే ఇందుకు నిదర్శనం.

ఫీజుల వివరాలు చెప్పట్లే..

ప్రైవేట్​ హాస్పిటల్స్​ ట్రీట్​మెంట్​కు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను తీసుకోవాలని డీఎంహెచ్​వోలకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓపీ, ఐపీ, ఆపరేషన్లు, ఇతర సేవలకు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో వివరాలు అందించాలని ప్రైవేట్​ హాస్పిటల్స్​ను డీఎంహెచ్​వోలు కోరారు. కానీ, ప్రైవేట్​ హాస్పిటల్స్​ ఆ వివరాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి. వివరాలు కోరి రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి, నల్గొండ, జనగామ, హన్మకొండ, సంగారెడ్డి, పెద్దపల్లి వంటి కొన్ని జిల్లాల నుంచి అరకొర సమాచారం వచ్చింది. యాదాద్రి జిల్లా నుంచి 50 శాతానికి పైగా సమాచారం రాగా మిగిలిన జిల్లాల నుంచి 20 నుంచి -25 శాతం మాత్రమే సమాచారం వచ్చిందని తెలుస్తోంది. 

తప్పుడు లెక్కలు..

ఫీజుల సమాచారం ఇచ్చిన హాస్పిటల్స్​ కూడా తప్పులు లెక్కలు చూపిస్తున్నాయి. ఓపీ ఫీజు తప్ప మిగిలిన ట్రీట్‌‌‌‌మెంట్ల ఫీజుల వివరాలు తప్పుగా పేర్కొన్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరిలో పేరున్న హాస్పిటల్​ తాను ఇచ్చిన సమాచారంలో గర్భిణి సిజేరియన్​ ఫీజు రూ.25 వేలుగా పేర్కొంది. కానీ ఆ హాస్పిటల్స్​ యాజమాన్యం రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తోంది. ఇలాంటి హాస్పిటల్స్​ ఎన్నో ఉన్నాయి. తీసుకునే ఫీజుకు రశీదు ఇవ్వాలని షరతు విధిస్తే దోపిడీని కట్టడి చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కొన్ని హాస్పిటల్స్ పేర్కొన్న ఫీజులు

ఓపీ  :   రూ.150 నుంచి రూ.300
ఐపీ  :   రూ.1,500 నుంచి రూ.2,500
న్యూ బోర్న్ ఓపీ :  రూ.1,500
సిజేరియన్  :  రూ.20 వేల నుంచి రూ.25 వేలు
నార్మల్ డెలివరీ   :  రూ.15వేల నుంచి రూ.20 వేలు
ఓపెన్ ట్యూబెక్టమీ   : రూ.12 వేల నుంచి రూ.15 వేలు
లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ  :  రూ.20 వేల నుంచి రూ.25 వేలు
అపెండెక్స్ ఆపరేషన్  :  రూ.30 వేలు
లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ   : రూ.40 వేల నుంచి రూ.45 వేలు