పహల్గాం ఎటాక్, ఢిల్లీ కారు బ్లాస్ట్ మా పనే: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్ నేత

పహల్గాం ఎటాక్, ఢిల్లీ కారు బ్లాస్ట్ మా పనే: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్ నేత

ఇస్లామాబాద్: పహల్గాం టెర్రర్ ఎటాక్, ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల పనేనని ఎట్టకేలకు పాక్ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్ అంగీకరించారు. పాకిస్తాన్‎తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలే ఇండియాలోని ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు దాడులు చేశాయని ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. మీరు బలూచిస్తాన్‌ను రక్తసిక్తం చేస్తూ ఉంటే.. మేం ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు భారతదేశంపై దాడి చేస్తామని ముందే చెప్పామని.. అల్లా దయతో  మేం ఆ పని చేశామన్నారు. ఢిల్లీ దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను ఇప్పటికీ లెక్కించలేకపోతున్నారని బలుపు మాటలు మాట్లాడారు. 

2025, ఏప్రిల్‎లో జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఒకే మతాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 26 మంది చనిపోయారు. ఇదిలా ఉండగానే.. 2025, నవంబర్‎లో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఎర్రకోట దగ్గర మరో టెర్రర్ ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు దాడులు ప్రాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలే చేసినట్లుగా ఏజెన్సీలు గుర్తించాయి. 

ఈ క్రమంలో పాకిస్తాన్‎తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలే ఇండియాలోని ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు దాడులు చేశాయని పాక్ నేత చౌదరి అనర్వుల్ హక్ బహిరంగంగా ఒప్పుకోవడం ప్రపంచ దేశాలకు ఈ దాడుల వెనక ఉన్నది పాకిస్తానేనని స్పష్టంగా అర్ధమైంది. మొత్తానికి.. ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్‎తో పాటు పహల్గాం దాడి కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల పనే అనడానికి అన్వరుల్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 

అయితే.. బలూచిస్తాన్‎లో దాడులకు ప్రతీకారంగానే భారత్‎లో మేం దాడులు చేస్తున్నామని అనర్వుల్ అంటున్నారు. కానీ బలూచిస్తాన్‌లో అశాంతికి ఇండియానే కారణమని పాక్ చేస్తున్న ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. బలూచిస్తాన్ పాక్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ప్రయత్నిస్తోందని.. ఇది పాక్ అంతర్గత సమస్య అని దాయాది దేశ ఆరోపణలకు ఇండియా కౌంటర్ ఇస్తోంది.